Atlee: బాలీవుడ్‌లోనూ జోరు.. ముంబైలో రూ.38 కోట్ల సీ ఫేసింగ్ ఇంటిని కొనుగోలు చేసిన అట్లీ

Atlee (1)

Atlee (1)

Atlee: ‘జవాన్’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడిగా తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్న అట్లీ, ఇప్పుడు  ముంబైలో కొత్త ఇంటిని కొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అల్లు అర్జున్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’ కు అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమూవీకి దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డ వేళ, అట్లీ కొనుగోలు చేసిన విలాసవంతమైన కొత్త ఇల్లు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా నివేదికల ప్రకారం, ముంబైలోని అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాల్లో ఒకటైన బాంద్రాలో అట్లీ సముద్రానికి ఎదురుగా ఉండే లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఆస్తి విలువ సుమారు రూ.38 కోట్లుగా అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు నివసించే ప్రీమియం ప్రాంతంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్, అరేబియా సముద్రం అందాలను నేరుగా వీక్షించే అవకాశం కల్పిస్తుందని సమాచారం. దీంతో అట్లీ ఇప్పుడు ముంబైలోని అత్యంత విలాసవంతమైన నివాస సముదాయాల్లో ఒకదానికి యజమానిగా నిలిచారు.

ఇక ఈ ఇంటిని అట్లీ తన భార్య ప్రియ కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అత్యాధునిక విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయని సమాచారం. బాంద్రా ప్రాంతం ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులకు చిరునామాగా మారింది. అక్కడే నటి పూజా హెగ్డేకు కూడా సుమారు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విలాసవంతమైన నివాసం ఉంది. ఇప్పుడు అదే ప్రాంతంలో అట్లీ కూడా స్థిరపడటంతో ఆయన బాలీవుడ్‌లో కూడా జోరు పెంచేందుకేనని విశ్లేషకులు  భావిస్తున్నారు. దక్షిణాది చిత్రసీమలో విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు హిందీ పరిశ్రమలోనూ ప్రముఖుల సరసన చేరినట్టే కనిపిస్తోంది. అట్లీ సినీ ప్రయాణాన్ని పరిశీలిస్తే, తొలి చిత్రం ‘రాజా రాణి’తోనే దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అనంతరం తలపతి విజయ్‌తో తెరకెక్కించిన ‘తేరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ సినిమాలు వరుస విజయాలు సాధించాయి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందించిన ‘జవాన్’ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదు చేసి, అట్లీని పాన్ ఇండియా స్టార్ దర్శకుడిగా నిలబెట్టింది. ఆ విజయంతో ఆయనకు బాలీవుడ్‌లోనూ భారీ అవకాశాలు లభించాయి.

ప్రస్తుతం అట్లీ పూర్తి దృష్టిని ‘రాకా’ చిత్రంపైనే కేంద్రీకరించారు. అల్లు అర్జున్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న ఈ యాక్షన్ ఫాంటసీ చిత్రం అత్యాధునిక విజువల్స్ తో రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఇప్పటికే విపరీతమైన ఆసక్తి నెలకొంది. సినిమాల్లో వరుస విజయాలు, మరోవైపు కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్లో పెట్టుబడులు చూస్తుంటే, అట్లీ కెరీర్ మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితం కూడా అదే స్థాయిలో ముందుకు సాగుతోందని చెప్పవచ్చు. దర్శకుడిగా తన ముద్ర వేస్తూనే, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఆయన ప్రయాణం ప్రస్తుతం సినీ పరిశ్రమలో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.