NTV Telugu Site icon

రివ్యూ: అతడు ఆమె ప్రియుడు

athadu aame priyudu

athadu aame priyudu

యండమూరి వీరేంద్రనాథ్ రచనలను విపరీతంగా ఇష్టపడిన పాఠకులు ఒకప్పుడు బాగా ఉండేవారు. తరం మారగానే యండమూరి కాల్పనిక సాహిత్యానికి తిలోదకాలిచ్చి పర్సనాలిటీ డెవలప్ మెంట్ రచనల వైపు మళ్ళారు. రచయితగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి మెగా ఫోన్ పట్టుకుని ‘అతడు ఆమె ప్రియుడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. రామ్ తుమ్మలపల్లి, రవి కనగాల నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.

రవి (బెనర్జీ) ఓ ఆస్ట్రానోమర్. అతనో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. కానీ ఆమె వేరొకరిని ప్రేమిస్తుంది. తన ప్రియుడిని ఎప్పటికైనా కలవగలనని నమ్ముతూ ఉంటుంది. శోభనం రాత్రి భర్తకు తన ప్రేమ విషయం చెబుతుంది. ఆమె మనోభావాలను గౌరవిస్తూ రవి సైతం సమాజం దృష్టిలో మాత్రమే భర్తగా ఉంటాడు. భీమరాజు (కౌశల్‌) కు తన చెల్లి అంటే ఎంతో ప్రేమ. ఆమెను రోషన్ (భూషణ్‌) అనే కుర్రాడు ప్రేమ పేరుతో మోసం చేస్తాడు. ఆమె ఆత్మహత్యకు కారణమౌతాడు. తన చావుకు కారకుడైన రోషన్ ను బ్రతకనివ్వవద్దని అన్నయ్య భీమరాజును ఆమె కోరుతుంది. చెల్లి చివరి కోరిక తీర్చడానికి బయలుదేరిన రాజు పొరపాటున రోషన్ ను బదులు అతని ట్విన్ బ్రదర్ మోహన్ ను హత్య చేస్తాడు. అతని కోసం పోలీసులు గాలిస్తుంటారు. ప్రవర (సునీల్)కు అమ్మాయిలంటే పిచ్చి. నాలుగు తీయటి మాటలు చెప్పి వారిని బుట్టలో వేసుకుంటూ ఉంటాడు. ఒక వర్షం కురిసిన రాత్రి రవి ఇంటిలోకి గత్యంతరం లేని పరిస్థితిలో రాజు, ప్రవర ప్రవేశిస్తారు. ఈ ప్రపంచానికి అదే ఆఖరి రాత్రి అని, యుగాంతానికి కొద్ది నిమిషాల సమయం మాత్రమే ఉందని ఆస్ట్రానొమర్ రవి ద్వారా వాళ్ళకు తెలుస్తుంది. ఆ తర్వాత వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నదే ‘అతడు ఆమె ప్రియుడు’ కథ.

ముగ్గురు జీవితాలకు సంబంధించిన ఈ కథ వినటానికి ఆసక్తికరంగానే ఉంటుంది. అలానే తెర మీద చూపించినప్పుడు మొదట్లో అదోలా అనిపించినా, రానురాను ఆసక్తికరంగా మారింది. స్నేహం, ప్రేమ, నమ్మక ద్రోహం వంటి అంశాల చుట్టూ కథ సాగడం బాగుంది. అయితే భార్యను మామూలు మనిషిని చేయడం కోసం ప్రొఫెసర్ పడే ఆరాటం హాస్యాస్పదంగా ఉంది. ఓ చిన్న ట్రిక్ తో అతను నమ్మించేది కేవలం ఇద్దరు ముగ్గురినే అయినా కథకు మూలం అయిన యుగాంతం అనే పాయింట్ ఎంత మాత్రం నమ్మశక్యంగా అనిపించదు. ప్రేక్షకుల మనసులో ఎక్కడో కొడుతూనే ఉంటుంది. పైగా ప్రొఫెసర్‌ ప్లాన్ చేసిన సమయానికి ఏదో కూడా బలుక్కున్నట్టు రాజు, ప్రవర అతని ఇంటిలోకి అడుగుపెట్టడం మరీ కామెడీగా ఉంది. ఇవాళ్టి యువత, ప్రేమ పట్ల వారికి ఉన్న చులకనైన భావనను తెర మీద చూపించాలని, అసలైన ప్రేమ అంటే ఏమిటో తెలపాలని యండమూరి అనుకున్నారు. ఆ రకంగా ఆసక్తికరమైన కథను రాసుకున్నారు. కానీ దానిని అంతే ఆసక్తికరంగా తెరకెక్కించే క్రమంలో మాత్రం తడబడ్డారు. ఓ నవలను పాఠకులు చదువుతూ, వారికి తగ్గ స్థాయిలో ఊహించుకుంటూ ఆనందించడం వేరు. కానీ ప్రత్యక్షంగా ఓ కథను తెర మీద చూడటం వేరు. ఇలాంటి సంక్లిష్టమైన కథను ఎంపిక చేసుకున్నప్పుడు, సన్నివేశాలను మరింత ఇంటస్ట్రింగ్ గా తెరకెక్కించాలి. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. ఉన్న పరిమిత వనరులను దృష్టిలో పెట్టుకుని తీసేశారని ప్రతి సన్నివేశంలోనూ అనిపిస్తుంది. ఇక సహజంగా రచయితలు దర్శకులు అయితే… పేజీల కొద్ది సంభాషణలు రాసేస్తారు. ఈ సినిమా ప్రారంభంలో పాత్రధారులు మాట్లాడటం మర్చిపోయారా? అనే సందేహం ఒకానొక సమయంలో ప్రేక్షకుడికి కలిగినా, ఆ తర్వాత వీళ్ళేంటి మరీ ఇంత ఎక్కువగా మాట్లాడేస్తున్నారు అనిపిస్తుంది. మహిళ గొప్పతనాన్ని రకరకాల పేర్లతో కౌశల్ చెప్పడం బాగానే ఉంది. అలానే ప్రొఫెసర్ కు దగ్గరయ్యే క్రమంలో మహేశ్వరి అతిగా మాట్లాడటం సరదాగానే ఉంది. కానీ ఈ రెండు సన్నివేశాలూ ఏకపాత్రాభినయాలను తలపించాయి.

సునీల్, కౌశల్, బెనర్జీ ఇందులో కీలక పాత్రలు పోషించారు. మహేశ్వరి ద్వితీయార్థంలో ఎంట్రీ ఇచ్చినా అక్కడ నుండి షో ను బాగానే నడిపింది. ఆమె వాయిస్ మాడ్యులేషన్ బాగుంది. అలనాటి మేటి నటుడు, స్వర్గీయ నాగభూషణం మనవడు, సినిమాటోగ్రాఫర్ మీర్ తనయుడు భూషణ్ ఇందులో ట్విన్ బ్రదర్స్ గా నటించాడు. దియా, జెన్నీ తమ పాత్రల్లో ఇమిడిపోయారు. కెమెరామేన్ మీర్ ఈ చిత్రానికి కూర్పరిగా వ్యవహరించడం విశేషం. ఈ చిత్రంలోని బిట్ సాంగ్స్ కు ఫ్లూట్ నాగరాజు స్వరరచన చేయగా, నేపథ్య సంగీతాన్ని ప్రద్యోత్తన్ అందించాడు. ముందు అనుకున్నట్టుగా పరిమిత బడ్జెట్ లో తీసిన ఈ సినిమాను నుండి మనం భారీతనాన్ని ఆశించలేం. సినిమా చూస్తున్నంత సేపు ఏదో పుస్తకం చదువుతున్న అనుభూతే కలుగుతుంది. యండమూరి నుండి ఇంకాస్తంత బెటర్ మూవీని ఆయన అభిమానులు కోరుకుంటారు. కనీసం రాబోయే రోజుల్లో అయినా ఆయన దానిని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది

రేటింగ్: 2.25/5

ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
యండమూరి రచన, దర్శకత్వం

మైనెస్ పాయింట్స్
పసలేని కథ, కథనం
బడ్జెట్ పరిమితులు

ట్యాగ్ లైన్: అతడు ఆమె ఓ సందేశం!