NTV Telugu Site icon

Hello World: ఆర్యన్‌ రాజేశ్‌, సదా అప్పుడు థియేటర్లో… ఇప్పుడు ఐటీ కంపెనీలో!

Hello World Series

Hello World Series

Aryan Rajesh Sada Starring Hello World Web Series Gearing Up For Release: ప్రముఖ దర్శక, నిర్మాత, స్వర్గీయ ఇవీవీ సత్యనారాయణ తనయుడు ఆర్యన్ రాజేశ్‌ ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ పైనా దృష్టి పెట్టాడు. జీ 5 ఒరిజినల్స్ ‘హలో వరల్డ్’ వెబ్ సీరిస్ లో రాజేశ్‌ ఓ కీలక పాత్ర పోషించాడు. విశేషం ఏమంటే ఇందులో సదా మరో ప్రధాన పాత్రను పోషించింది. ఆర్యన్ రాజేశ్‌, సదా జంటగా నటించిన ‘లీలామహల్ సెంటర్’ మూవీ అప్పట్లో చక్కని విజయం సాధించి, వీరిద్దరికి హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చిపెట్టింది.

అప్పుడు థియేటర్ నేపథ్యంలోని సినిమాలో నటించిన వీరిద్దరూ, ఇప్పుడు ఐటీ కంపెనీ బ్యాక్ డ్రాప్ వెబ్ సీరిస్ లో నటిస్తున్నారు. ఎన్నో ఆశలతో ఓ పెద్ద ఐటీ కంపెనీలో చేరిన ఎనిమిది మంది యువతకు సంబంధించిన కథ ఇది. వారి అంచనాలకు తగ్గట్టుగా ఆ వర్క్ ప్లేస్ ఉందా లేదా? ఐటీ కంపెనీ జాబ్ తో కెరీర్ ను ప్రారంభించిన వీరు జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సి వచ్చింది? ఈ నేపథ్యంలో ఎనిమిది ఎపిసోడ్స్ గా ‘హలో వరల్డ్’ వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది. ‘తెలుగులో ఆఫీస్ డ్రామా వెబ్ సీరిస్ లు చాలా రేర్‌ అని, అందువల్ల వీక్షకులకు ఇదో కొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం ఉంద’ని దర్శకులు శివసాయి వర్థన్ జలదంకి చెబుతున్నారు.

గతంలో శివసాయి ‘గీతా సుబ్రహ్మణ్యం’ వెబ్ సీరిస్ ను డైరెక్ట్ చేశారు. యంగ్ టెక్కీస్ మెంటాలిటీని తెలియచేసే ఈ ఆఫీస్ డ్రామా ఆగస్ట్ 12 నుండి జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. రామ్ నితిన్, నయన్ కరిష్మా, సుదర్శన్ గోవింద్, నిత్యాశెట్టి, నిఖిల్ వి సింహా, అపూర్వా రావ్, జి. అనిల్‌, స్నేహల్ ఎస్ కామత్, రవివర్మ, జయప్రకాశ్‌ తదితరులు ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. పి.కె. దండి దీనికి సంగీతాన్ని సమకూర్చగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందించారు. ‘ఒక చిన్న ఫ్యామిలీ కథ’ తర్వాత నిహారిక కొణిదల ప్రొడ్యూస్ చేస్తున్న వెబ్ సీరిస్ ఇది!

Show comments