సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్ తమిళంలో ఇప్పుడు భిన్నమైన కథా చిత్రాలలో నటిస్తున్నాడు. తెలుగులోనూ ‘బ్రూస్ లీ’, ‘సాహో’ సినిమాలలో కీలక పాత్రలు పోషించాడు. అతని తాజా చిత్రం ‘యానై’. ప్రియ భవానీ శంకర్, సముతిర కని, ‘కేజీఎఫ్’ రామచంద్రరాజు, రాధిక శరత్ కుమార్, యోగిబాబు, అమ్ము అభిరామి ఇందులో కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ హరి రూపొందించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చాడు.
యుక్తవయసు నుండి సినిమాలపై పేషన్ తో ఉత్తరాంధ్రలో పంపిణీదారుడిగా మారిన సిహెచ్. సతీశ్ కుమార్ తమిళ స్టార్ హీరో ధనుష్ ‘ధర్మయోగి’తో నిర్మాతగా మారారు. ఆ తర్వాత ‘బూమరాంగ్, లోకల్ బాయ్స్’ను సొంత బ్యానర్ విఘ్నేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మించారు. తాజాగా ఆయన తమిళ చిత్రం ‘యానై’ను ‘ఏనుగు’ పేరుతో తెలుగులో డబ్ చేసి, విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ ఈ నెల 17న విడుదల చేయబోతున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 12వ తేదీ చేయబోతున్నారు.
