Anushka Shetty: టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న అనుష్క శెట్టి, ఇప్పుడు తన కెరీర్ ప్లానింగ్‌ను పూర్తిగా మార్చేసినట్లే కనిపిస్తోంది. ‘బాహుబలి’ తర్వాత గ్లోబల్ రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న స్వీటీ, ఆ తర్వాత ఎంచుకున్న బాట అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ‘భాగమతి’ తర్వాత కేవలం లేడీ ఓరియెంటెడ్ కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది. తెరపై తానే ప్రధాన ఆకర్షణగా నిలవాలన్న ఆలోచనతో, రెండేళ్లు, మూడేళ్లకు ఒక సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడం మొదలుపెట్టింది. కానీ, ఆ స్ట్రాటజీ ఇప్పుడు బెడిసికొట్టిందా అన్న చర్చ మొదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘ఘాటి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. సోలోగా సినిమాను నిలబెట్టాలన్న ప్రయత్నం గట్టి దెబ్బే కొట్టింది. దాంతో ఇకపై కేవలం తన భుజాలపైనే సినిమా భారాన్ని మోసే సాహసం చేయకూడదని అనుష్క ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. అందుకే ఇన్నాళ్లూ ఫాలో అయిన ఫీమేల్ సెంట్రిక్ ఫార్ములాను పక్కనపెట్టేసి, భారీ తారాగణం ఉండే పెద్ద ప్రాజెక్టుల వైపు స్వీటీ చూపు తిప్పిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇందులో భాగంగానే మలయాళ స్టార్ హీరో జయసూర్య నటిస్తున్న భారీ ఫాంటసీ థ్రిల్లర్ ‘కథనార్’లో స్వీటీ భాగమైందని చెబుతున్నారు. 9వ శతాబ్దపు మాంత్రికుడి కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క ‘నీలి’ అనే విలక్షణమైన రోల్ చేస్తోంది. రీసెంట్గా వచ్చిన ట్రైలర్లో కేవలం రెండు షాట్లలోనే మెరిసినా, తన లుక్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. ‘ఘాటి’ నాటి లుక్ కంటే ఇందులో చాలా ఫ్రెష్‌గా, క్యూట్‌గా కనిపిస్తోందని స్వీటి. సోలో హీరోయిన్ ప్రాజెక్టులకు కాస్త గ్యాప్ ఇచ్చి, ఇలాంటి క్రేజీ మల్టీస్టారర్ కాన్సెప్ట్‌లతో మళ్లీ ఫామ్‌లోకి రావాలనేది ఆమె ప్లాన్‌గా కనిపిస్తోంది. ఈ మార్పుతో అనుష్క మళ్లీ కమర్షియల్ ట్రాక్‌లోకి వచ్చేసినట్లేనని సినీ ప్రియులు భావిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథల గిరి దాటి బయటకు వచ్చిన జేజమ్మను, త్వరలోనే మళ్లీ టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే సినిమాల ఎంపికలో రూటు మార్చిన స్వీటీ.. ప్రమోషన్ల విషయంలో మాత్రం పాత పద్ధతినే ఫాలో అవుతుందా? లేక ఈసారైనా నేరుగా గ్రౌండ్ లెవల్లోకి వచ్చి సినిమాను జనాల్లోకి తీసుకెళ్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

