‘బన్నీ, భగీరథ, ఢీ’ చిత్రాల నిర్మాత ఎం.ఎస్.ఎన్ రెడ్డి సోదరుడి కుమారుడు ఎం.ఎస్.రెడ్డి ఫ్లోటింగ్ షర్పా ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘నాకౌట్’. దీని ద్వారా మహీధర్ హీరోగా, ఉదయ్ కిరణ్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో ఆరంభం అయ్యాయి. దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. హీరో, హీరోయిన్ల పై తీసిన తొలి సన్ని వేశానికి సాయి రాజేశ్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో నిర్మాత ఎం.ఎస్.రెడ్డి మాట్లాడుతూ ‘దర్శకుడు చెప్పిన కథ ఆసక్తికరంగా ఉంది. పూర్తిగా బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో 7 ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటిని ప్రముఖ ఫైట్ మాస్టర్స్ తో కంపోజ్ చేయిస్తాం. ఇతర తారాగణం టెక్నీషియన్స్ ఎంపిక చేసి మార్చి మొదటి వారం నుండి నిర్విరామంగా షూటింగ్ జరిపి 60 రోజులలో పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేస్తాం’ అన్నారు.
దర్శకుడు కిరణ్ మాట్లాడుతూ ‘కథ నచ్చి నిర్మాత అవకాశం కల్పించారు. ఓ మార్షల్ ఆర్జిస్ట్ తన లైఫ్ లోని ప్రతి ఫేస్ లో ఎదురయ్యే హార్దిల్స్ ను ఎలా ఎదుర్కొంటాడు. ఆ ప్రాసెస్ లో తనేం కోల్పోతాడు. అనుకున్న గోల్ ను రీచ్ అయ్యాడా? లేదా? అనేదే కథ. యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో తీయనున్నాం. హైదరాబాద్, వైజాక్, అరకు ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం’ అని తెలిపారు. హీరో మహీధర్ మాట్లాడుతూ ‘దీనికోసం కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను. ఈ అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు’ అని చెప్పాడు.
