Vasuki: స్వప్న సినిమా నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ఇందులో కీలక పాత్ర పోషించిన నటి వాసుకి మూవీ విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. వాసుకి నటించిన తొలి తెలుగు సినిమా ‘తొలిప్రేమ’ విడుదలై 23 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత పలు అవకాశాలు వచ్చినా ఆమె అంగీకరించలేదు. ఆ సినిమా తర్వాత ప్రముఖ కళాదర్శకుడు ఆనంద్ సాయిని ఆమె వివాహం చేసుకుంది. మళ్ళీ ఇంతకాలానికి కెమెరా ముందుకు వచ్చింది. ఆ విశేషాలు తొలుత చెబుతూ, “‘తొలిప్రేమ’ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. నాకు నచ్చిన అవకాశాలు కూడా వచ్చాయి. కానీ చేయడం నాకు కుదరలేదు. ఎందుకంటే నేను మల్టీ టాస్కర్ కాదు. అన్ని పనులు ఒకేసారి చేయలేను. ముందు పిల్లలు, వాళ్ళ చదువులు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు యూకేలో చదువుతున్నారు. పాప మెడిసిన్ (ఫోర్త్ ఇయర్), బాబు సెకండ్ ఇయర్ ఆర్కిటెక్చెర్. ఆనంద్ సాయి ఆయన పనిలో బిజీగా వుంటారు. ఇప్పుడు ఏదైనా చేయడానికి నాకు సమయం కుదిరింది. ఇలాంటి సమయంలో నందిని రెడ్డి ఈ కథతో వచ్చారు. నాకు నచ్చింది. సినిమాతో పాటు చదువుపై కూడా దృష్టి పెట్టాను. సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్నాను” అని తెలిపింది.
ఈ సినిమా అంగీకరించడానికి కారణం చెబుతూ, “ఒక విరామం తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నామంటే కంఫర్ట్ జోన్ ముఖ్యం. ‘తొలిప్రేమ’ చేసినప్పుడు నాకు 18 ఏళ్ళు. అప్పుడు డైలాగ్ రాకపోయినా, తెలుగు రాకపోయినా, కొత్త స్థలమైనా… ఏదైనా ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళిపోయాను. ఈ ఏజ్ లో రీఎంట్రీ చేయాలంటే మాత్రం ఒక సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ చూస్తాం. స్వప్న ఎప్పుడూ సినిమా చేయమని అడుగుతుండేది. ఫైనల్ గా నాకు సినిమా చేయడానికి వీలు కుదిరింది. కథ విన్న వింటనే సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ ఫీలయ్యాను. ఓకే చెప్పాను. ఇందులో చాలా క్యూట్ సిస్టర్ పాత్రలో కనిపిస్తాను. అన్నీ ఫ్యామిలీస్ లో వున్న సిస్టర్ క్యారెక్టరే. తమ్ముడు ఏం చేసినా సపోర్ట్ చేసే ఒక అక్క వుంటుంది. అలాంటి పాత్రే నాది. నాకు, సంతోష్ పాత్ర కు చాలా మంచి బాండింగ్ వుంటుంది. ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు” అని చెప్పింది. ఇప్పుడు వస్తున్న చిత్రాలకు ఇది పూర్తి భిన్నమైందని చెబుతూ, “ఈ మధ్య చాలా వైలెన్స్ సినిమాలు, డిస్టర్బ్ చేసే సినిమాలే వస్తున్నాయి. అంతా బాగానే జరిగింది, హ్యాపీ గా వుందనే సినిమాలు తగ్గిపోయాయి. ఒక మంచి ఫెయిరీ టేల్ చదువుతున్నప్పుడు ఎంత ఆనందంగా హాయిగా వుంటుందో.. ‘అన్నీ మంచి శకునములే’ అలా వుంటుంది” అని తెలిపింది. అప్పటి తన కో-స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, “ఆనంద్, కళ్యాణ్ చాలా మంచి స్నేహితులు. సహజంగానే మా మధ్య మంచి అనుబంధం వుంది. కళ్యాణ్ అప్పటికి, ఇప్పటికి వ్యక్తిగా ఒకేలా వున్నారు” అని కితాబిచ్చింది.
యాదాద్రి రూపకల్పనలో తన భర్త ఆనందసాయి పాత్ర గురించి చెబుతూ, “యాదాద్రి ప్రాజెక్ట్ ఆరంభం నుంచి చివరి దాక నేను ఆయనతోనే వున్నాను. చిన్న కాగితంలో కొండని గీసి చూపించినప్పటి నుంచి సి.ఎం. కేసిఆర్ గారు ఆయనకి సన్మానం చేసిన రోజు వరకూ.. ప్రాజెక్ట్ సంబధించిన ప్రతి డెవలప్ మెంట్ నాకు తెలుసు. ఆయన ప్రతిది చెప్పేవారు. యాదాద్రి ప్రాజెక్ట్ చేయడం మాకు దొరికిన భాగ్యం. గొప్ప ప్రాప్తం. అది చరిత్రలో నిలిచిపోతుంది” అని అన్నారు.