Annapoorani: లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ఏడాది జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత నయన్.. అన్నపూరణి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నీలేశ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో జర్నీ ఫేమ్ జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కే ఎస్ రవి కుమార్, రెడిన్ కింగ్‌స్లే, రేణుకు, కార్తీక్ కుమార్, పూర్ణిమా రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, నాట్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఆ సమయంలోనే తమిళనాడును వరదలు ముంచెత్తాయి. ఇక తిండికి కూడా కష్టంగా మారిన ఆ సమయంలో సినిమాను చూడడానికి ఎవరు వస్తారు. అందుకే ఈ చిత్రం భారీ పరాజయం అందుకుంది. ఇదే కాకుండా ఈ సినిమా రిలీజ్ కు ముందే వివాదంగా నిలిచింది.
ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి.. చెఫ్ గాఎదగడానికి నాన్ వెజ్ ను వండడం, తినడం.. దీనివలన ఆ అమ్మాయి కుటుంబం అగ్రహారంలో పరువును పోగొట్టుకోవడం అనేది చూపించారు. దీంతో బ్రాహ్మణ సంఘం ఈ సినిమా రిలీజ్ కు అడ్డుపడింది. అయినా రిలీజ్ చేసినా కూడా ఫలితం దక్కలేదు. ఇక నెలరోజుల్లోపే ఈ సినిమా ఓటిటీలోకి అడుగుపెడుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అన్న పూరణి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. డిసెంబర్ 29 నుంచి లేడీ సూపర్ స్టార్ మూవీ ఓటీటీలోకి రానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ నయన తార సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. మరి ఓటిటీలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
