NTV Telugu Site icon

Anjali Devi: మరపురాని అంజలీదేవి అభినయం!

Anjali

Anjali

Anjali Devi:అంజలీ దేవి పేరు వినగానే ఆ తరం ప్రేక్షకులకు ‘సీతమ్మ’ అనే గుర్తుకు వస్తుంది. తెలుగువారి తొలి రంగుల చిత్రం ‘లవకుశ’లో సీతమ్మ పాత్రలో ఆమె నటించలేదు, జీవించారనే చెప్పాలి. అందుకే ఈ నాటికీ బుల్లితెరపై ఆ సినిమా రాగానే అంజలీదేవిని సీతమ్మ పాత్రలో చూసి పులకించిపోయేవారు ఎందరో!

అంజలీదేవి పుట్టినతేదీపై భిన్నాభిప్రాయాలు వినిపించేవి. అయితే అంజలీదేవి స్వయంగా తాను 1927లో దసరా అయిన తరువాత సరిగ్గా మూడు వారాలు పూర్తయ్యాక మరుసటి రోజున పుట్టానని పెద్దలు తెలిపినట్టు చెప్పేవారు. అలా ఆమె 1927 అక్టోబర్ 28న జన్మించారని లెక్కలు కట్టారు. కొందరు ఆమె ఆ యేడాది ఆగస్టు 24న జన్మించారనీ టముకు వేశారు. ఏమయితేనేమి, తన అందాల అభినయంతో అంజలీదేవి తెలుగువారిని ఎంతగానో పరవశింప చేశారు. దాంతో ఆ లెక్కలు పట్టించుకోకుండా, ఎవరికి వారు తమకు తోచిన తేదీని గుర్తు చేసుకొని అంజలీదేవికి శుభాకాంక్షలు చెప్పేవారు. అంజలీదేవి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. అందరూ అంజనమ్మా అంటూ పిలిచేవారు. చిన్నతనంలోనే అంజలీదేవి వినసొంపైన రాగాలకు నాట్యం చేసేవారు. దాంతో ఆమెలో ఓ మంచినటి దాగివుందని కన్నవారు ప్రోత్సహించారు. ఆమె తండ్రికి ఆదినారాయణ రావు స్నేహితుడు. అతను నాటకాలు రాస్తూ, వేస్తూ, సంగీతం సమకూరుస్తూ సాగేవారు. అలా ఆదినారాయణరావు, అంజలీదేవిని రంగస్థలంపై నటిగా తీర్చిదిద్దారు. ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే అంజలీదేవి ‘సత్యహరిశ్చంద్ర’లో లోహితాస్యుని పాత్ర పోషించారు. తరువాత ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో ‘కష్టజీవి’లో నాయికగా ఎన్నికయ్యారు. మూడు రీళ్ళు షూటింగ్ జరుపుకోగానే ఈ చిత్రం అటకెక్కింది. ఆ సమయంలో సి.పుల్లయ్య, అంజలీదేవిని పరీక్షించి, తన ‘గొల్లభామ’ చిత్రంలో నాయికగా ఎన్నుకున్నారు. ఆ సినిమాలో ఆమె పేరును అంజలీదేవిగా మార్చారు సి.పుల్లయ్య.

తన కంటే వయసులో పన్నెండేళ్ళు పెద్దవారయిన ఆదినారాయణ రావునే వివాహమాడారు అంజలీదేవి. తెలుగు తమిళ భాషల్లో అంజలీదేవి అభినయం ఆకట్టుకుంటూ సాగింది. యన్టీఆర్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’. అయితే యన్టీఆర్ హీరోగా ‘షావుకారు’ ముందు విడుదలయింది. ‘పల్లెటూరి పిల్ల’లో శాంత పాత్రలో అంజలీదేవి ఎంతగానో మురిపించారు. ఆ చిత్రానికి ఆమె భర్త సంగీత దర్శకత్వంతో పాటు, నిర్మాణవ్యవహారాలు చూసుకున్నారు. తరువాతి రోజుల్లో ఏయన్నార్ తో కలసి ‘మాయలమారి’ వంటి చిత్రాలు నిర్మించారు. సి.పుల్లయ్య తెరకెక్కించిన ‘పక్కయింటి అమ్మాయి’లో రేలంగికి నాయికగా నటించి ఆకట్టుకున్నారు. తన దరికి చేరిన ప్రతీ పాత్రకు న్యాయం చేయాలని తపించేవారు అంజలీదేవి. తమ సొంత చిత్రం ‘పరదేశి’తోనే శివాజీగణేశన్ కు చిత్రసీమకు పరిచయం చేశారు. అయితే ఈ సినిమా కంటే ముందు తమిళంలో శివాజీగణేశన్ ‘పరాశక్తి’ విడులయింది. తమిళంలో యమ్జీఆర్, శివాజీ, జెమినీ గణేశన్ వంటి టాప్ స్టార్స్ తో నటించిన అంజలీదేవి, తెలుగులో యన్టీఆర్, ఏయన్నార్ తో అనేక విజయవంతమైన చిత్రాల్లో అభినయించారు.

యన్టీఆర్ తో “రేచుక్క, జయసింహ, చరణదాసి, పాండురంగ మహాత్మ్యం, రాజనందిని, బాలనాగమ్మ, భట్టి విక్రమార్క, లవకుశ, పరువు-ప్రతిష్ఠ, పల్నాటి యుద్ధం, బడిపంతులు” వంటి విజయవంతమైన చిత్రాలలో నాయికగా నటించారు. ఇక ఏయన్నార్ జోడీగా అంజలీదేవి నటించిన “స్వప్నసుందరి, పరదేశి, అనార్కలి, సువర్ణసుందరి, చెంచులక్ష్మి, జయభేరి, భక్త తుకారాం” వంటి చిత్రాలు తెలుగువారిని ఎంతగానో అలరించాయి. తరువాతి రోజుల్లో ఈ ఇద్దరు నటులకు ఆమె తల్లి పాత్రల్లోనూ కనిపించడం విశేషం. అంజలీ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కిన అనేక చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. సదరు చిత్రాలకు ఆమె భర్త స్వరకల్పన సైతం తెలుగువారిని విశేషంగా మురిపించింది. అంజలీ పిక్చర్స్ నిర్మించిన ‘పరదేశీ’తో శివాజీ గణేశన్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. చిన్ని ఫిలిమ్స్ పతాకంపై అంజలీదేవి దంపతులు నిర్మించిన ‘అమ్మకోసం’తోనే నటి రేఖ తొలిసారి నాయికగా కనిపించారు. వర్ధమాన నటునిగా చిరంజీవి సాగుతున్న సమయంలో అంజలీ పిక్చర్స్ వారి ‘చండీప్రియ’ ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టింది. అంజలీదేవి ఎన్ని చిత్రాలలో నటించినా, 1963లో విడుదలైన ‘లవకుశ’లో సీతమ్మగా ఆమె అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సీతారాములు పాత్రల్లో అంజలీదేవి, యన్టీఆర్ ఒదిగిపోయారు. అలా తెలుగువారి సీతమ్మగా ఆమె నిలచిపోయారు.

చిత్రసీమలో నటిగా, నిర్మాతగా అంజలీదేవి చేసిన సేవలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం 1994లో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది. 1993లో చందమామ విజయా కంబైన్స్ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘బృందావనం’లో ఆమె నటించారు. ఆ తరువాత నటనకు దూరంగా ఉన్న అంజలీదేవి 2014 జనవరి 13న కన్నుమూశారు. ఈ నాటికీ తెలుగు, తమిళ చిత్ర రంగాల్లో నటిగా అంజలీదేవిని జనం స్మరించుకుంటూనే ఉన్నారు.