‘సంక్రాంతి అల్లుళ్లు’ విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్… ఈసారి ‘సమ్మర్ సోగాళ్ళు’గా మారిపోయారు. అయితే… వాళ్ళు సమ్మర్ కైనా వస్తారా అనే సందేహాన్ని ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజ్ ఫాన్ నాగరత్తమ్మ (సునయన) వ్యక్తం చేస్తోంది. కొత్త సంవత్సరంలో ‘ఎఫ్ 2 ఫ్రాంచైజ్’ ఫ్యాన్స్ కు విషెస్ తెలియచేస్తూ, అనిల్ రావిపూడి ఓ సరదా వీడియోను రూపొందించి, సోషల్ మీడియాలో వదిలాడు. సంక్రాంతి పండగ అంటే అరిసెలు, పూతరేకులు కంపల్సరీ! వాటిని తయారు చేసుకుని నాగరత్తమ్మ, అనిల్ రావిపూడి ఇంటికెళ్లి ‘ఎఫ్ 3’ అప్ డేట్ గురించి ఆరా తీస్తుంది. అయితే ఈసారి తన హీరోలు ‘సంక్రాంతి అల్లుళ్ళు’ కాదని ‘సమ్మర్ సోగాళ్ళు’ అని అనిల్ రావిపూడి వివరణ ఇవ్వడంతో ఒక్కసారిగా నాగరత్తమ్మలో ఫ్రస్ట్రేషన్ కట్టలు తెంచుకుంటుంది. ఇలా సినిమా రిలీజ్ ను ఒక తేదీ నుండీ మరో తేదీకి పుష్ చేయడానికి తామెలా కనిపిస్తున్నామని అనిల్ ను నిలదీస్తుంది.
కనీసం సమ్మర్ రిలీజ్ మాట మీద అయినా నిలబడతారా? లేకపోతే ఉగాది సమయానికి మూవీని దసరాకు తోశామని చెబుతారా? అంటూ కడిగిపారేస్తుంది. అలాంటిదేమీ లేదని అనిల్ చెప్పడంతో తాను తెచ్చిన పూతరేకులు, అరిసెల్ని వాపస్ తీసుకెళుతూ, సమ్మర్ కు బంగినపల్లి మామిడి పళ్ళతో వస్తానంటూ ముక్తాయించింది. పనిలో పనిగా అనిల్ రావిపూడి… నాగరత్తమ్మకు, ఆమె అనిల్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పడంతో ఈ సరదా వీడియో ముగిసింది. నిజానికి ఫిబ్రవరిలో ‘ఎఫ్ 3’ మూవీని విడుదల చేయాలని తొలుత దర్శక నిర్మాతలు అనిల్ రావిపూడి, దిల్ రాజు అనుకున్నారు. కానీ అనివార్య కారణాలతో అదిప్పుడు సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 29కి మారిపోయింది. న్యూ ఇయర్ సందర్భంగా ఆ విషయాన్ని అనిల్ ఇలా వీడియో రూపంలో చేయడంతో ‘ఎఫ్ 2 అండ్ ఎఫ్ 3’ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఈ వీడియో చూసి సరదాగా నవ్వుకుంటున్నారు.