Itlu Arjuna Teaser: కొత్త కుర్రాడు అనీష్ కృష్ణ హీరోగా పరిచయమవుతున్న సరికొత్త లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna). ప్రసిద్ధ టాలీవుడ్ దర్శకుడు వెంకీ కుడుముల మొదటిసారిగా నిర్మాతగా మారి ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించారు. మహేష్ ఉప్పల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మలయాళ క్రేజీ బ్యూటీ అనస్వర రాజన్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ అందించిన ఈ మూవీ టీజర్ నిన్ననే (సెప్టెంబర్ 19న) చాలా గ్రాండ్‌గా విడుదలైంది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ టీజర్‌ను లాంచ్ చేశారు. తన మొదటి సినిమాలోనే ఎలాంటి డైలాగ్స్ లేకుండా, కేవలం సైగలతోనే అనీష్ చూపించిన ఇంటెన్స్ నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత వెంకీ కుడుముల మాట్లాడుతూ.. గతంలో నేను కేవలం ఒక దర్శకుడిగా సినిమాలోని సీన్ల గురించి మాత్రమే ఆలోచించేవాడిని, కానీ ఇప్పుడు నిర్మాతగా మారి బడ్జెట్ విషయాలను కూడా చూసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల మిగతా క్రాఫ్ట్స్‌పై నా అవగాహన మరింత పెరిగింది. గతంలో నా దర్శకత్వంలో రష్మిక మందన్నను తెలుగుతెరకు పరిచయం చేసినందుకు ఎంత గర్వంగా ఉండేదో, ఇప్పుడు హీరోగా అనీష్‌ని పరిశ్రమకు పరిచయం చేస్తున్నందుకు అంతే ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా. సినిమాలో తను అద్భుతంగా నటించాడు. దర్శకుడు మహేష్ చాలా టాలెంటెడ్, తను చెప్పిన కథను తెరపై చూసినప్పుడు నాకు పూర్తి సంతృప్తి కలిగింది. హీరోయిన్ అనస్వర రాజన్ ఈ సినిమాకు మంచి ఎనర్జీ తెచ్చిందని ప్రశంసించారు.
ఇదే వేదికలో హీరో అనీష్ మాట్లాడుతూ.. నేను ఈ రోజు ఇక్కడ ఒక హీరోగా నిలబడటానికి ముఖ్య కారణం నిర్మాత వెంకీ అన్న మాత్రమే. ఈ చాలెంజింగ్ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి, నన్ను పరిశ్రమకు పరిచయం చేసినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. దర్శకుడు మహేష్ ఈ కథను అద్భుతంగా రాశారు. ఇందులో నేను చేసిన అర్జున పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. సాధారణంగా సినిమాల్లో డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఈ సినిమాలో మాటలు రాని ఒక మూగ యువకుడిగా కేవలం సైలెన్స్, ఎమోషన్స్‌తోనే కథ నడుస్తుంది. అర్జున మాటలు మీకు వినిపించకపోవచ్చు కానీ, అతని ప్రేమ, యాక్షన్ కి మాత్రం ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారని చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఇందులో హీరో అర్జున్ (అనీష్) మాటలు రాని ఒక మూగ యువకుడు. అతను తన పక్కింటి అమ్మాయి కీర్తి (అనస్వర రాజన్) తో గాఢమైన ప్రేమలో పడతాడు. సమాజంలో చాలా మంది అతని సైగలను అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలో, హీరోయిన్ మాత్రం అతని మనసును, ప్రేమను చాలా సులువుగా చదివేస్తుంది. అయితే వీరి హ్యాపీ లవ్ స్టోరీలో అనుకోకుండా కొంతమంది రౌడీలు, అవినీతి పోలీసులతో కీర్తికి పెద్ద సమస్యలు వస్తాయి. మాటలు రాని ఆ ప్రేమికుడు తన ప్రేమను, తన ప్రియురాలి ప్రాణాన్ని గెలిపించుకోవడానికి ఎలాంటి పోరాటం చేశాడనేదే ఈ మూవీ ఉత్కంఠభరితమైన కథ. ఈ బ్యూటిఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ 2026 అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

