తెలుగు బుల్లితెరపై ఒకప్పుడు యాంకరింగ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఉదయభాను. వెండితెర హీరోయిన్లతో సమానంగా స్టార్‌డమ్ తెచ్చుకున్న తొలి తరం స్టార్ యాంకర్ ఆమె. బుల్లితెరపై ఒక ఊపు ఊపిన తర్వాత వెండితెరపై కూడా మెరిసి, ఈ మధ్య నిర్మాతగా కూడా మారిన ఆమె.. కొన్నాళ్లుగా టీవీ షోలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా దీనిపై స్పందించిన ఉదయభాను, ప్రస్తుత టెలివిజన్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటున్న తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారారు. కొంతకాలంగా తాను టీవీ షోలకు ఎందుకు దూరంగా ఉంటున్నాను అనే విషయాన్ని వివరిస్తూ, ప్రస్తుత బుల్లితెర ట్రెండ్‌పై ఉదయభాను సెటైర్లు వేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టాలెంట్ కంటే ‘పీఆర్’ (పబ్లిక్ రిలేషన్స్), సెల్ఫ్ ప్రమోషన్ ఉన్నవారికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇండస్ట్రీలో షోలు, భారీ ఈవెంట్లు ఎవరికి దక్కాలనే దాని వెనుక గట్టి పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆమె అన్నారు. కేవలం తమకంటూ ఒక బలమైన పీఆర్ నెట్‌వర్క్ మెయింటైన్ చేస్తూ, నిరంతరం హడావుడి చేసే వారే ఇప్పుడు టీవీ షోలను, సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లను గుత్తాధిపత్యంగా ఏలుతున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.
ఉదయభాను తన కామెంట్లలో ఎవరి పేరూ నేరుగా ప్రస్తావించలేదు. కానీ, ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, సెలబ్రిటీ ప్రోగ్రామ్‌లతో ఎక్కడ చూసినా కనిపిస్తూ బుల్లితెరను శాసిస్తున్న టాప్ యాంకర్లను ఉద్దేశించే ఆమె ఈ చురకలు అంటించారని ఇండస్ట్రీ వర్గాల్లో, నెటిజన్లలో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకరిద్దరు మాత్రమే పాలిటిక్స్ చేస్తూ అన్ని షోలు చేజిక్కించుకోవడం కాకుండా.. కొత్త ప్రతిభను కూడా ప్రోత్సహించి, వారికి అవకాశాలు కల్పించి లైమ్‌లైట్‌లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉందని ఉదయభాను స్పష్టం చేశారు. అయితే ఉదయ భాను చెబుతున్నది వందకు వంద శాతం నిజం. కానీ ఇక్కడ టాలెంట్ ను వెతుక్కుంటూ వెళ్ళేంత టైం అటు దర్శక నిర్మాతలకి ఇటు ఈవెంట్ మేనేజర్లకు లేదు. ఎవరైతే తమని తాము సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటూ లైం లైట్లో ఉంటున్నారో, వాళ్ళకే అవకాశాలు. అలా చేసుకోవడం ఇప్పుడు పార్ట్ ఆఫ్ గేమ్. అలా చేయడం మానేసి తనని అవకాశాలు వెతుక్కుంటూ రావాలనుకోవడం సరికాదు. ఎందుకంటే దర్శక నిర్మాతలు ఎవరైనా సరే ఇప్పుడు ట్రెండ్ లో ఎవరున్నారు, ఎవరి చేత షో చేస్తే టీఆర్పీ వస్తుంది, ఎవరితో ఈవెంట్ చేయిస్తే జనాలు ఆసక్తి చూపుతారు అనేది పరిశీలించాకే ముందుకు వెళ్తారు. అలా ట్రెండ్ లో ఉండడం కోసం వాళ్ళు పీఆర్ గేమ్స్ ఆడినా, సెల్ఫ్ ప్రమోషన్ చేసుకున్నా తప్పేం ఉంది?

