ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప: ది రైజ్’ను ఇటీవల మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాల కేటగిరిలో ‘పుష్ప’ తెలుగు వర్షన్ ను ఇంగ్లీష్, రష్యన్ సబ్ టైటిల్స్ లో ప్రదర్శించడం విశేషం. గత యేడాది డిసెంబర్ 17న విడుదలైన ‘పుష్ప’ చిత్రం మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో డబ్ అయ్యింది. హీరో, హీరోయిన్లు అల్లు అర్జున్, రశ్మికా మందణ్ణపై చిత్రీకరించిన ‘శ్రీవల్లి’ పాటతో పాటు సమంతపై పిక్చరైజ్ చేసిన ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా’ ఐటమ్ సాంగ్ కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది. దానికి తోడు ఇప్పుడీ మూవీ వేవ్స్ వివిధ దేశాలను తాకుతున్నాయి.
అతి త్వరలోనే రష్యన్ డబ్బింగ్ వర్షన్ ను కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల కాగానే స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్… ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. అంతేకాదు. అంతర్జాతీయంగానూ అతనికిప్పుడు గుర్తింపు లభిస్తోంది. ఇటీవలే న్యూయార్క్ టైమ్ స్వ్కేర్ లో భారతదేశం తరఫున హాజరై యాన్యువల్ డే పెరెడ్ లో పాల్గొన్నాడు. ‘పుష్ప: ద రైజ్’తో వచ్చిన పేరు ప్రఖ్యాతులను మరింత పెంచుకునేలా ఐకాన్ స్టార్ దీనికి సీక్వెల్ చేయబోతున్నాడు. ఇటీవలే ‘పుష్ప: ది రూల్’ పూజా కార్యక్రమాలు జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ సైతం అతి త్వరలోనే మొదలు కానుంది.
