Vedha Jalandhar: ‘అమీర్ లోగ్’.. బిర్యానీ చుట్టూ తిరిగే కథ

Vedha Jalandhar

Vedha Jalandhar

టాలీవుడ్‌లో సహజత్వంతో కూడిన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మించగా, రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అమీర్ లోగ్’. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానాకు చెందిన ప్రముఖ సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఆగస్ట్ 21న గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన నటి వేధా జలంధర్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

సినిమాలో తన పాత్ర గురించి వేధా జలంధర్ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో నా క్యారెక్టర్ చాలా సహజంగా, పక్కింటి అమ్మాయిలా ఉంటూనే మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. మా అమ్మ వ్యక్తిత్వమే నాకు స్ఫూర్తి. ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఇందులో కనిపిస్తుంది. ఆడిషన్స్ ద్వారా దర్శకుడు రమణ గారు నన్ను ఎంపిక చేసుకున్నారు. ఇందులో ప్రతి పాత్రకూ కథలో ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది” అని తెలిపారు.

చిత్ర కథాంశం గురించి ప్రస్తావిస్తూ.. “‘అమీర్ లోగ్’ సినిమాలో బిర్యానీ అనేది ఒక కీలక పాత్రలా కథతో పాటు ప్రయాణిస్తుంది. లైవ్ లొకేషన్లలో సింక్ సౌండ్‌తో ఈ సినిమాను షూట్ చేశాం. బస్తీ ప్రజలు షూటింగ్‌కు ఎంతగానో సహకరించారు. స్మరణ్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమా స్థాయిని మరో పది మెట్లు పైకి తీసుకెళ్లింది. మేము తెరపై చూపించలేని ఎమోషన్లను ఆయన తన మ్యూజిక్‌తో పలికించారు” అని వివరించారు.

సినిమాలోని భాష, యాసల గురించి మాట్లాడుతూ.. “ఎమోషన్ అనేది ప్రపంచంలో ఎవరికైనా ఒకటే. అందువల్ల భాషా భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ కథ కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే సినిమా చూసిన స్పిరిట్ మీడియా టీమ్‌తో పాటు ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య గారు మా పాత్రలను, రమణ గారి రైటింగ్‌ను ఎంతగానో ప్రశంసించారు. ఆరేళ్ల సినీ ప్రయాణంలో ఎన్ని సినిమాలు చేశామనే నంబర్ కంటే, చేసిన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ఎంత గుర్తింపు తెచ్చుకున్నామనేదే నాకు ముఖ్యం” అని వేధా జలంధర్ స్పష్టం చేశారు. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది.