అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప: ద రైజ్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు! ముఖ్యంగా, అది బాలీవుడ్‌లో సృష్టించిన ప్రకంపనాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన ఈ చిత్రం.. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమా సత్తా చాటింది. దీంతో సుకుమార్ ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప 2’ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌కి తగినట్టు కథలో మార్పులు చేస్తున్నాడు. కొన్ని కీలక పాత్రల్ని జత చేస్తోన్న డైరెక్టర్.. వాటికి ఆయా సినీ పరిశ్రమల్లోని ప్రముఖ నటీనటుల్ని రంగంలోకి దింపేందుకు సమాయత్తమవుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే.. ‘పుష్ప 2’కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరమీదకొచ్చింది. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నాడట! ఒకటి కొడుకు పాత్ర కాగా, మరొకటి తండ్రి పాత్ర! కొడుకు పాత్రలో చాలా యంగ్‌గానూ, తండ్రి పాత్రలో 55 ఏళ్ల వ్యక్తిగానూ బన్నీ కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే, ఇందులో ఎంతవరకు నిజముందో తేలాల్సి ఉంది. కాగా.. పుష్పరాజ్‌గా బన్నీ కనబర్చిన నటనా ప్రతిభకు సర్వత్రా ప్రశంసలు వచ్చిపడ్డ విషయం విదితమే! స్టార్ హీరో అయ్యుండి, అలాంటి రగ్డ్ లుక్‌లో మాసీ రోల్ చేయడం నిజంగా విశేషం. నిజానికి, బన్నీ పెర్ఫార్మెన్స్ వల్లే పుష్ప: ద రైజ్ అంత పెద్ద హిట్ అయ్యిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. రష్మికా మందణ్ణ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
