స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లో ఇటీవల కాలంలో చాలా మార్పు వచ్చింది. ఇతర హీరోల సినిమాలకు ప్రచారం చేయటమే కాదు తను నటించిన సినిమా యూనిట్ తోనూ ఎల్లప్పుడూ సత్సబంధాలను ఏర్పరచుకుంటున్నాడు. అంతే కాదు తనది మంచి మనసు అని తాజాగా మరోసారి నిరూపించుకున్నాడు. బన్నీ తను నటించిన ‘పుష్ప’ సినిమా టాప్ టెక్నీషియన్స్‌కి 10 గ్రాముల బంగారం బహుమతిగా అందజేశాడట. ‘పుష్ప’ షూటింగ్ సమయంలో అడవుల్లో వారు పడిన కష్టాన్ని దగ్గరగా గమనించాడు కాబట్టే ఇలా గోల్డెన్ గిఫ్ట్‌తో సత్కరించాడట.
ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా యూనిట్ లోని ప్రధాన సాంకేతిక నిపుణులతో పాటు తన వ్యక్తిగత సిబ్బందికి కూడా ఈ గోల్డెన్ గిఫ్ట్ లను అందచేశాడట. ఇక ఈ సినిమాకి పని చేసిన లైట్ బాయ్స్, సెట్ వర్కర్లు, ఇతర సిబ్బందికి కూడా 12 లక్షలు వెచ్చించి బహుమతులను అందచేశాడట. ఇటీవల ఎపి ప్రభుత్వానికి కూడా వరదబాధితుల సహాయార్ధం అల్లు అర్జున్ వ్యక్తిగతంగా 25 లక్షల విరాళాన్ని అందించగా, ఆయన హోమ్ ప్రొడక్షన్ గీతా ఆర్ట్స్ 10 లక్షలను విరాళంగా అందించింది. మరి అల్లు అర్జున్ ను స్ఫూర్తిగా తీసుకుని ఇతర హీరోలు కూడా తమ ఉదాత్తతను చాటుకుంటారేమో చూడాలి.
