Site icon NTV Telugu

Allu Aravind: మట్టిలోంచి పుట్టిన కథ ‘కాంతార’

Allu Aravind

Allu Aravind

Allu Aravind: కన్నడలో సెప్టెంబ‌ర్ నెలాఖ‌రులో రిలీజైన ‘కాంతార’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న విడుద‌లై, ఇక్కడ కూడా సూప‌ర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేసారు. ఈ చిత్రం విజయవంతంగా ప్ర‌ద‌ర్శిత‌మౌతున్న నేప‌థ్యంలో బుధ‌వారం మీడియాకు మ‌రోసారి సినిమాను ప్ర‌ద‌ర్శించి అనంత‌రం చిత్ర బృందం త‌మ కృత‌జ్ఞ‌త‌ల‌ను మీడియా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిపింది.

హీరో క‌మ్ డైరెక్ట‌ర్ రిష‌భ్ శెట్టి మాట్లాడుతూ, ”రిలీజైన ప్రతిచోటా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన రామారావు గారికి ధన్యవాదాలు. ఈ సినిమా నాకు మంచి ఎనర్జీ నిచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. మూడు రోజుల్లో 20 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. చిన్నప్పటి నుండి ఇక్కడ జరిగే విషయాలను చూస్తూ పెరిగాను. వారాహ రూపం అనేది విష్ణు మూర్తికి కనెక్ట్ అవుతుంది. కనుక దాంతో మా కల్చర్ కు ఎమోషన్స్ జోడించి ఈ సినిమా చెయ్యడం జరిగింది” అని అన్నారు. హీరోయిన్ స‌ప్త‌మి గౌడ లీల పాత్ర‌లో త‌న‌ను ఆద‌రించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఇలాంటి మంచి సినిమాలో త‌న‌కు చ‌క్క‌ని పాత్ర‌ను ఇచ్చిన రిష‌బ్ శెట్టికి న‌టుడు ప్ర‌మోద్ శెట్టి ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

ఈ సంద‌ర్భంగా అల్లు అర‌వింద్ మాట్లాడుతూ, ”ఈ సినిమాను రిలీజ్ కంటే ముందు ఒకసారి చూడమని కొంద‌రు మిత్రుల‌కు చెప్పాం. ఇవాళ సాధార‌ణ ప్రేక్ష‌కుడు కూడా చూసి ఆద‌రిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం. ఇది మట్టిలోంచి పుట్టిన కథ. ఇది ఎక్కడో కొరియన్, హాలీవుడ్ సినిమాలను నుంచి కాపీ కొట్టింది కాదు. ఈ సినిమాలో విష్ణు తత్త్వం, రౌద్ర రూపం చూశాక మ‌న‌ సింహాచలంకి దగ్గరగా ఉన్న కథ అనిపించింది. ఈ చిత్రంలో హీరో ఎంత గొప్పగా చేసాడో మీరు చూశారు. అతను ఫీల్ అయ్యి చేయడం వలన ఈ సినిమా అంతలా కనెక్ట్ అయింది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన అజనీష్ లోకనాధ్ అద్భుతంగా నేప‌థ్య సంగీతం ఇచ్చాడు. జాతరలో జరిగే అరుపులను, కొన్ని సౌండ్స్ ను రికార్డ్ చేసి మ్యూజిక్ తో పాటు వదిలారు. ఈ సినిమాను కన్నడలో చూసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి అర్జెంటుగా మీరొక సినిమా చూడండి అంటూ బన్ని వాసు నాతో చెప్పాడు. ఏంటి బన్ని వాసు ఇంత ఎగ్జైట్మెంట్ చెబుతున్నాడు అనుకున్నాను. సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది.ఈ ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి దీనిని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అనిపించి ఒక అవకాశంగా తీసుకుని దీనిని తెలుగులో రిలీజ్ చేసాం. ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏమిటంటే గీతా ఆర్ట్స్ లో సినిమా చేయమని రిషబ్ శెట్టిని అడిగాను ఆయన కూడా ఒప్పుకున్నాడు” అని అన్నారు.

Exit mobile version