Site icon NTV Telugu

‘ఆహా’… అల్లు అరవింద్!

allu aravind

allu aravind

అల్లు అరవింద్ – ఈ పేరు వింటే చాలు ముందుగా ఆయన ప్రణాళికలు గుర్తుకు వస్తాయి. ‘ఆహా’ ఓటీటీని సక్సెస్ రూటులో సాగేలా చేస్తున్నారు. అందులో భాగంగా ఏ నాడూ టాక్ షో చేయని నటసింహ నందమూరి బాలకృష్ణతో ‘ఆహా’ అనిపించేలా ‘అన్ స్టాపబుల్’ షో చేయిస్తున్నారు. దీనిని బట్టే అల్లు అరవింద్ మేధస్సులోని పవర్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎందరో యువనిర్మాతలు అరవింద్ ను ఆదర్శంగా తీసుకొని చిత్రసీమలో సాగుతున్నారు. కొందరు నిర్మాతలకు ఆయనే మార్గదర్శిగానూ ఉన్నారు. ‘గీతా ఆర్ట్స్ ‘ పతాకంపై అనేక చిత్రాలను నిర్మించి విజయపథంలో సాగిన అల్లు అరవింద్, ‘గీతా ఆర్ట్స్ -2’ పేరుతో మరికొందరు వర్ధమాన నిర్మాతలతో కలసి చిత్రాలను నిర్మిస్తున్నారు. అలుపన్నది ఆయన నిఘంటువులో లేని పదం అని ఆయన పనితీరును చూస్తే తెలుస్తుంది. ఇప్పటికి నాలుగున్నర దశాబ్దాలుగా చిత్రనిర్మాణంలో సాగుతూనే ఉన్నారాయన.

తెలుగు సినిమా రంగంలో నిర్మాతగా అల్లు అరవింద్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఓ చిత్రాన్ని ఏ బడ్జెట్ లో నిర్మించవచ్చు, దానిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళ వచ్చు. అన్న అంశాలలో ఆయన రూపొందించేలా ఎవరూ ప్రణాళికలు అల్లలేరని ప్రతీతి. చిరంజీవిని ‘మెగాస్టార్’గా నిలపడంలోనూ అల్లు అరవింద్ కృషిని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. నాటి స్టార్ హీరోస్ నడుమ చిరంజీవిని నిలపడానికి అరవింద్ ఎంత శ్రద్ధ వహించారో ఈ నాటికీ కథలుగా చెప్పుకుంటారు. చిరంజీవి ఓ సినిమా అంగీకరించగానే, దానిని ఏ తీరున తెరకెక్కించాలి అన్న అంశం మొదలు, నిర్మాణానికి ఎంత వ్యయం చేయాలి, పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెట్టాలి అన్న ప్రణాళికలు రూపొందించి సదరు నిర్మాతలకు అందజేసేవారు. అంతేకాదు, ఏ సెంటర్ లో ఎలాంటి కటౌట్స్ పెట్టాలి అన్న అంశంలోనూ అరవింద్ పాత్ర ఉండేది అంటే ఆయన ఎంతలా శ్రమించేవారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి అభిమానులకు ఆయన వారధిగా ఉండేవారు. అందుకే చిరంజీవితో గీతా ఆర్ట్స్ పతాకంపై అరవింద్ ఓ చిత్రం నిర్మిస్తున్నారంటే అభిమానులు అది తమ సొంత చిత్రంగా భావించేవారు. అరవింద్ కూడా అభిమానులను ఆనందింప చేసే ‘పసివాడి ప్రాణం, అత్తకు యముడు- అమ్మాయికి మొగుడు, అన్నయ్య’ వంటి చిత్రాలను తీసి అలరించారు. ఆ సినిమాలు ఇప్పటికీ అభిమానుల మదిలో ఆనందం వెదజల్లుతూనే ఉండడం విశేషం.

చిరంజీవిని మెగాస్టార్ గా నిలిపిన అరవింద్, మెగా కాంపౌండ్ కు కూడా రూపశిల్పి అని చెప్పక తప్పదు. ఒకప్పుడు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య ఒక్కరే వారి కుటుంబంలో నటుడు. అరవింద్ కూడా కొన్ని చిత్రాలలో కామెడీ రోల్స్ పోషించారే కానీ, ఏ నాడూ సీరియస్ గా నటనపై దృష్టి సారించింది లేదు. అయితే తమ కుటుంబంలోకి చిరంజీవి రాగానే, అరవింద్ నటకుటుంబాన్ని విస్తరించారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌ ను ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’తో హీరోగా జనం ముందు నిలిపిందీ ఆయనే, పవన్ ను దర్శకునిగా ‘జాని’తో పరిచయం చేసిందీ ఆయనే. ఇక పవన్ కు ‘జల్సా’ వంటి అదిరిపోయే హిట్ అందించింది కూడా ఆయనే. తన తనయుడు అల్లు అర్జున్ ను ‘గంగోత్రి’తో హీరోగా పరిచయం చేసి, తరువాత స్టైలిష్ స్టార్ గా ఎదగడానికీ దోహదపడిందీ అరవిందే. తన మేనల్లుడు, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు కెరీర్ లోనే బిగ్ హిట్ గా ‘మగధీర’ను నిర్మించి ఇచ్చిందీ ఆయనే. వీరేకాదు చిరంజీవి కుటుంబానికి చెందిన సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి వారినీ హీరోలుగా నిలపడంలోనూ ప్రముఖ పాత్ర పోషించారు. వెరసి ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ‘మెగా కాంపౌండ్’లో పలువురు హీరోలు తయారు కావడానికి అరవిందే కారణమని అందరికీ తెలుసు.

ఒకప్పుడు డబ్బింగ్ సినిమాల నిర్మాతగా సాగారు అరవింద్. తరువాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘బంట్రోతు భార్య, దేవుడే దిగివస్తే’ వంటి చిత్రాలను నిర్మించి నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు. ఆపై ‘బంగారు పతకం, ఎత్తుకు పైఎత్తు’వంటి అనువాద చిత్రాలతో ఆకట్టుకున్నారు. చిరంజీవితో ‘యమకింకరుడు’ తీసి మెప్పించారు. ఆ తరువాత చిరంజీవిని స్టార్ గా నిలపడంలో “శుభలేఖ, మంత్రిగారి వియ్యంకుడు,” వంటి చిత్రాల నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారు. ఏది ఏమైనా ఈ నాటికీ నిర్మాతగా తనదైన బాణీ పలికిస్తూనే సాగుతున్నారు అరవింద్. తమ గీతా ఆర్ట్స్ పతాకంపై తనయుడు అల్లు అర్జున్ తో నిర్మించిన ‘సరైనోడు’తో బంపర్ హిట్ కొట్టారు. గీతా ఆర్ట్స్ -2 బ్యానర్ పై నిర్మించిన ‘గీత గోవిందం’తోనూ అదరహో అనే విజయాన్ని సాధించారు. ఇక గీతా ఆర్ట్స్ భాగస్వామ్యంలో రూపొందిన ‘అల…వైకుంఠపురములో’ సినిమాతో తనయుడు అల్లు అర్జున్ ను టాప్ స్టార్స్ లో ఒకరిగా నిలిపారు.

ఓ వైపు చిత్ర నిర్మాణం, మరోవైపు ‘ఆహా’ నిర్వహణ, తనయులు, బంధువుల చిత్రాల ప్లానింగ్ అన్నిటా అరవింద్ ఏదో విధంగా పాలుపంచుకుంటూ బిజీ బిజీగానే సాగుతున్నారు. అందుకే అలుపెరుగని అరవింద్ ను చూసి సినీజనం ‘ఆహా’ అంటున్నారు.

Exit mobile version