Site icon NTV Telugu

కిక్కా? బ్యాడ్ లక్కా?… ఫిబ్రవరి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఇదీ !

Bheemla Nayak and Khiladi

2022 తెలుగు చిత్ర పరిశ్రమకు నిరాశాజనకంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. జనవరిలో విడుదలైన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కాలేకపోయింది. ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరిపైనే ఉంది. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి పెద్ద చిత్రాలు ఈ నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ మహమ్మారి మూడవ వేవ్ కారణంగా అవి వాయిదా పడ్డాయి. దీంతో సంక్రాంతి పండుగ సీజన్‌లో బంగార్రాజు, రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చి వంటి చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్ట్ చేయలేకపోయాయి. ‘బంగార్రాజు’కు డీసెంట్ ఓపెనింగ్స్, మంచి రెస్పాన్స్ ఉన్నప్పటికీ, చాలా ఏరియాల్లో లాస్ వెంచర్‌గా మిగిలిపోయింది అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలకు చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి.

Read Also : విడిపోయినా ఒకే హోటల్ లో ధనుష్ జంట… ఇంటిపేరులోనూ నో చేంజ్ !

అందుకే ఇప్పుడు ఆశలన్నీ ఫిబ్రవరి రిలీజ్ ల పైనే ఉన్నాయి. నిజానికి గత ఏడాది టాలీవుడ్ బ్యాడ్ లక్ గా భావించే ఫిబ్రవరి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బాక్స్ ఆఫీస్ కు మంచి కిక్ ఇచ్చింది. కానీ ఫిబ్రవరి పరీక్షల సీజన్ కావడంతో మందకొడిగా ఉంటుంది. ఇప్పుడు దానికి మహమ్మారి కూడా తోడైంది. ఆంధ్రప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ, 50% ఆక్యుపెన్సీ ఉంది. కాబట్టి ఈ పరిమితులలో సినిమాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తే మేకర్స్‌కు ఇబ్బందులు తప్పవు. కానీ ఇప్పటికే రవితేజ ‘ఖిలాడి’, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’తో ఫిబ్రవరిలో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఫిబ్రవరి 11న ‘ఖిలాడీ’ని, 25న ‘భీమ్లా నాయక్‌’ను విడుదల చేయాలని మేకర్స్ మొండిగా ఉన్నారు. అయితే ఇప్పటికే చాలా సినిమాలు ప్రస్తుత పరిస్థితుల కారణంగా చివరి నిమిషంలో వాయిదా వేసుకోవడం చూస్తూనే ఉన్నాము.

ఖిలాడీ, భీమ్లా నాయక్‌తో పాటు డీజే టిల్లు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి కొన్ని చిన్న సినిమాలు కూడా ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ సినిమాలు తెరపైకి వచ్చి టికెట్ కౌంటర్ల వద్ద సత్తా చాటుతాయో లేక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విడుదల నుంచి వెనక్కి తగ్గుతాయో చూడాలి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కిక్కా? బ్యాడ్ లక్కా? అన్నది చూడాల్సిందే !

Exit mobile version