Alaya Shikharam Completes 40 Years: మెగాస్టార్ చిరంజీవి, వైవిధ్య చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ మధ్య అనుబంధం విశేషమైనది. దర్శకుడు కోడి రామకృష్ణ తొలిచిత్రం ‘ఇంట్లోరామయ్య-వీధిలో క్రిష్ణయ్య’ హీరో చిరంజీవి. అలాగే చిరంజీవి కెరీర్ లో 500 రోజులు చూసిన ఏకైక చిత్రంగా నిలచింది ఆ సినిమానే. అలా ‘ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్ణయ్య’తో ఘనవిజయం చూసిన చిరంజీవి, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో రెండవ చిత్రంగా ‘ఆలయశిఖరం’ తెరకెక్కింది. ఈ కాంబో వల్ల తొలి నుంచీ ‘ఆలయశిఖరం’పై అంచనాలు ఉండేవి. ఇక చిరంజీవి, సుమలత కలసి అంతకు ముందు ‘శుభలేఖ’లో నటించి విజయం చూశారు. సుమలత ఇందులో నాయిక కావడం వల్ల కూడా ‘ఆలయశిఖరం’పై సినీఫ్యాన్స్ ఆసక్తి పెంచుకున్నారు. 1983 మే 7వ తేదీన విడుదలైన ‘ఆలయశిఖరం’ మంచి ఆదరణ పొందింది.
ఇంతకూ ‘ఆలయశిఖరం’లోని కథ ఏమిటంటే – శీను గుర్రపు బండి తోలుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఆడంబరాలకు పోయే అన్న రాజశేఖర్, ఆశల పల్లకిలో ఊరేగే చెల్లెలు, బాధ్యతలేని తండ్రి, ఉన్నంతలో కాపురాన్ని నెట్టుకు వచ్చే తల్లి శీనుకు ఉన్న కుటుంబం. పూలమ్మే రాధకి శీను అంటే ప్రేమ. శీను అన్న రాజశేఖర్, సత్యమూర్తి అనే కోటీశ్వరుని కూతురును పెళ్ళాడతాడు. దాంతో సొంతవారినే నీచంగా చూడడం మొదలెడతాడు. శీను చెల్లెలు ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. పెళ్ళికి ఆ అబ్బాయి తల్లి బోలెడు కోరికలు చెబుతుంది. అన్నిటికీ తన పెద్ద కొడుకు ఉన్నాడు కదా అని శీను తండ్రి మాట ఇచ్చేస్తాడు. రాజశేఖర్ పట్టించుకోడు. తాను తమ్ముడిలా చూసుకొనే గుర్రాన్ని, బండిని ఇరవై వేలకు అమ్మేస్తాడు శీను. ఆ డబ్బును కూడా దోచేసి, శీను తండ్రి పేకాట ఆడాలని చూస్తాడు. అది తెలిసిన జనం ఛీ కొడతారు.
దాంతో అతనిలో మార్పు వస్తుంది. రిక్షా లాగుతూ ఉంటాడు. శీను ఉన్న డబ్బుతో చెల్లి పెళ్ళి జరిపిస్తాడు. సత్యమూర్తి ఫ్యాక్టరీలో దొంగసరుకు తయారవుతోందని తెలిసి చాకిరేవు పత్రిక సంపాదకుడు రాస్తాడు. అతడిని సత్యమూర్తి చంపిస్తాడు. ఆ నేరం రాజశేఖర్ పై పడుతుంది. రాజశేఖర్ ను అరెస్ట్ చేస్తారు. అన్న జైలులో ఉంటే వెళ్ళి అసలు ఏం జరిగిందని శీను అడుగుతాడు. రాజశేఖర్ భార్య సైతం అతనే హంతకుడని, అతనితో కలసి జీవించడానికి అయిష్టత చూపుతుంది. ఆ చాకిరేవు పత్రిక సంపాదకుని కొడుకునే శీను చెల్లెలు పెళ్ళాడి ఉంటుంది. దాంతో ఆమె కాపురం కూడా కష్టాల పాలవుతుంది. రాజశేఖర్ కు కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. పత్రికా సంపాదకుణ్ణి చంపేయడానికి కారకుడైన సత్యమూర్తి నౌఖరు అవతారం, సత్యమూర్తి మాటలు రికార్డ్ చేసి ఉంటాడు. అది చూపి సత్యమూర్తిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. అదే సమయంలో తన అన్న నిర్దోషి అని తెలుసుకున్న శీను, అవతారం కోసం గాలిస్తుంటాడు. అవతారాన్ని కూడా చంపేయాలని సత్యమూర్తి భావిస్తాడు. శీను, అతని తండ్రి, రాధ అందరూ కలసి మారువేషాలు వేసుకొని అవతారాన్ని విడిపిస్తారు. అతడిని రౌడీలు పొడిచేస్తారు. శీను గుర్రం వచ్చి, సత్యమూర్తిని చితక్కొడుతుంది. చివరి నిమిషంలో రాజశేఖర్ కు ఉరిశిక్ష తప్పుతుంది. నిర్దోషిగా విడుదలై, కన్నవారితో కలసి ఉంటాడు. రాధను పెళ్ళాడిన శీను తన గుర్రం బండి తోలుతూ సాగుతాడు.
ఈ చిత్రంలో రంగనాథ్, రీనా, ముచ్చర్ల అరుణ, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, డబ్బింగ్ జానకి, కాకినాడ శ్యామల, సుశీల, పి.యల్.నారాయణ, రాళ్ళపల్లి తదితరులు నటించారు. ఈ చిత్రానికి గొల్లపూడి రచన చేయగా, సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర, గోపి, ఉపద్రష్టసాయి పాటలు రాశారు. సత్యం సంగీతం సమకూర్చారు. ‘ఇది ఆశలు రేపే లోకం..’ అనే పాటను ప్రకాశ్ అనే గాయకుడు ఆలపించారు. శ్రీలలితా పిక్చర్స్ పతాకంపై జి.జగదీశ్ చంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులోని “ఇది ఆశలు రేపే లోకం…”, “నీ రూపు మారింది గోపాలుడా…”, “కొండలెక్కినా దేవుడా…”, “తప్పేముందిర ఉన్నది సెబితే…” అంటూ సాగే పాటలు అలరించాయి.
చిరంజీవితో తాను తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్ణయ్య’ టైటిల్ ను పిల్లలు రాసుకొనే పలక (Slate)పై ప్రచురించారు కోడి. ఈ ‘ఆలయశిఖరం’ టైటిల్ ను బ్లాక్ బోర్డ్ పై వేయడం విశేషం! తన గురువు దాసరి నారాయణరావుతో చిత్రాలు నిర్మించిన వారితో తరువాతి రోజుల్లో కోడి రామకృష్ణ కూడా సినిమాలు తీశారు. అలా దాసరితో ‘ఇదెక్కడి న్యాయం’, ‘కోరికలే గుర్రాలయితే’ నిర్మించిన జి.జగదీశ్ చంద్రప్రసాద్ ఈ సినిమాను కోడి దర్శకత్వంలో నిర్మించారు. తిరుపతి, ఆ పరిసర ప్రాంతాల్లోనే ‘ఆలయశిఖరం’ షూటింగ్ జరుపుకుంది.
Read Also: Mohammed Siraj : పద్దతి మార్చుకో సిరాజ్..