Akshay Kumar: క్లైమాక్స్ అనేది ఏ సినిమాకైనా ప్రాణం. అలాంటి క్లైమాక్స్ లేకుండానే ఒక సినిమా విడుదలైందంటే నమ్మడం కాస్త కష్టమే. కానీ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఓ సినిమాకి అలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అంతేకాదు, ఆ సినిమాలో ఆయనతో కలిసి నటించింది సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి శ్రీదేవి. తాజాగా అక్షయ్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో మరోసారి ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అక్షయ్ కుమార్, తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొన్న సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన తొలి సెలబ్రిటీ క్రష్ శ్రీదేవి అని అక్షయ్ వెల్లడించారు. దాంతో హోస్ట్ కరణ్ జోహార్, ఇద్దరూ కలిసి నటించిన ‘మేరీ బీవీ కా జవాబ్ నహీ’ సినిమాను ప్రస్తావించారు. అప్పుడే ఆ సినిమా వెనుక ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అక్షయ్ బయటపెట్టారు. ఆ సినిమా విడుదల కాలేదా అని కరణ్ ప్రశ్నించగా, అక్షయ్ స్పందిస్తూ విడుదలైందని, కానీ క్లైమాక్స్ చిత్రీకరించకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిందని తెలిపారు. సినిమాలో చివరి భాగంలో తాము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పే సన్నివేశం వరకు మాత్రమే షూటింగ్ జరిగిందని, కానీ అసలు ప్రతీకారం తీర్చుకునే క్లైమాక్స్ మాత్రం షూటింగ్ అసలు జరగనేలేదని చెప్పారు. చివరికి సినిమాలో “ఆ తర్వాత వాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు” అనే ట్యాగ్ తో కథను ముగించారని వెల్లడించారు. తన సినీ జీవితంలో ఇలాంటి అనుభవం మరొకటి లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
పంకజ్ పరాశర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్.ఎం. ఇక్బాల్ నిర్మించారు. అక్షయ్ కుమార్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, గుల్షన్ గ్రోవర్, అనుపమ్ ఖేర్, జానీ లివర్, లక్ష్మీకాంత్ బెర్డే, కిరణ్ కుమార్, నీనా గుప్తా, జయశ్రీ టి., జగదీష్ రాజ్, బ్రిజ్ గోపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. 1994లోనే షూటింగ్ పూర్తయినప్పటికీ, పలు కారణాలతో దాదాపు పదేళ్ల పాటు విడుదల కాలేదు. చివరకు 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు, ఈ చిత్రం 1992లో విడుదలైన తెలుగు హిట్ మూవీ ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’కు రీమేక్‌గా రూపొందింది. అక్షయ్ కుమార్, శ్రీదేవి కలిసి నటించిన ఏకైక చిత్రంగా కూడా ఇదే కావడం విశేషం.

