కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాకు సంబంధించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నటీనటుల ద్వారా ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాయి. కేవలం ప్రభుత్వాలే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం పాటలు, షార్ట్ ఫిలిమ్స్ రూపంలో ప్రజలలో అవేర్ నెస్ కలిగిస్తున్నాయి. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) దేశంలోని టాప్ స్టార్స్ తో ఓ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. హిందీ, మరాఠీ, పంజాబీ భాషల్లో ఇది ఉండబోతోందట. కరోనా కో హరానా హై పేరుతో సాగే ప్రచారంలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, మెగాస్టార్ చిరంజీవి, తమిళ హీరో ఆర్య, కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫిక్కీ ఛైర్ పర్శన్ సంజయ్ గుప్తా సైతం ధృవీకరించారు. పాపులర్ స్టార్స్ తో చేసే ఈ ప్రచారం కారణంగా కరోనా పై ప్రజలలో అవగాహన పెరుగుతుందని, తద్వారా దానిపై చేసే పోరాటం విజయవంతం అవుతుందని తాము విశ్వసిస్తున్నట్టు తెలిపారు.