Akshay Kumar:తన తాజా చిత్రం ‘సెల్ఫీ’తో కాసింత ఊరట చెందిన అక్షయ్ కుమార్ అమెరికాలో చిందేసి కనువిందు చేయాలని ఆశించారు. కానీ, ఆదిలోనే అక్షయ్ బృందానికి హంసపాదు ఎదురయింది. అక్షయ్ ‘ది ఎంటర్ టైనర్స్’ అనే పేరుతో అమెరికాలో ఓ డాన్స్ షో చేయడానికి ఎప్పటి నుంచో ప్రణాళిక వేసుకున్నారు. అక్కడ ఐదు కేంద్రాలలో ఐదు ప్రోగ్రామ్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. అక్షయ్ తో పాటు ఈ షోస్ లో నోరా ఫతేహి, దిశా పటానీ, సోనమ్ బజ్వా, స్టెబిన్ బెన్, జస్లీన్ రాయల్, మౌనీ రాయ్, అపర్ శక్తి ఖురానా, జహ్రాన్ ఖాన్ కూడా పాలుపంచుకోనున్నారు. వాస్తవానికి మార్చి 4న జరగవలసిన ఓ షో రద్దయిందట. ఈ షో కు తగిన రీతిలో నిధులు పోగేయలేకపోయారు. టిక్కెట్స్ అమ్మకాలు ఊహించిన దానిలో కనీసం పదోవంతు లేవు. ఈ నేపథ్యంలో మార్చి 4వ తేదీన జరగవలసిన ‘ది ఎంటర్ టైనర్స్’ ను రద్దు చేస్తున్నట్టు అక్కడి నిర్వాహకులు ప్రకటించారు. టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి డబ్బు వాపస్ చేస్తామనీ హామీ ఇచ్చారు.
‘ది ఎంటర్ టైనర్స్ ‘లో అక్షయ్ కుమార్ తన చిత్రాల్లోని పాపులర్ నంబర్స్ కు చిందేయనున్నారు. మార్చి 4వ తేదీ ‘ది ఎంటర్ టైనర్స్’ ప్రోగ్రామ్ కేన్సిల్ అయినా, మిగిలిన నాలుగు షోస్ ఎప్పటిలాగే జరగనున్నాయట! మార్చి 3న జార్జియాలో, మార్చి 8న టెక్సాస్ లోనూ షోస్ ఉంటాయి. అలాగే ఫ్లోరిడాలో మార్చి 11న, ఓక్లాండ్ లో మార్చి 12న ‘ది ఎంటర్ టైనర్స్’ హంగామా సాగనుంది. ఇప్పటికే నోరా ఫతేహి అమెరికా చేరుకుంది. అక్షయ్ కుమార్ మిగిలిన వారితో కలసి ఫిబ్రవరి 28న అమెరికాలో వాలనున్నారు. మరి మిగిలిన నాలుగు షోస్ లో అక్షయ్ ‘ది ఎంటర్ టైనర్స్’తో ఏ రీతిన రక్తి కట్టిస్తారో చూడాలి.
