నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ అంటే అప్పట్లో జనానికి భలే క్రేజ్! ఏయన్నార్, దాసరి కలయికలో ఓ డజన్ సినిమాలు వెలుగు చూశాక వచ్చిన చిత్రం ‘బహుదూరపు బాటసారి’. ఈ సినిమాకు ముందు దాసరి దర్శకత్వంలో ఏయన్నార్ నటించిన “ఏడంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం” వంటి హిట్ మూవీస్ జనాన్ని భలేగా అలరించాయి. వాటిలో ‘ప్రేమాభిషేకం’ ప్లాటినమ్ జూబ్లీ కూడా చూసింది. దాంతో దాసరి-అక్కినేని కాంబో అనగానే జనానికి సదరు చిత్రంపై ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది. ఆ సమయంలో ఏయన్నార్ హీరోగా దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రంగా ‘బహుదూరపు బాటసారి’ జనం ముందు నిలచింది. 1983 మే 19న ‘బహుదూరపు బాటసారి’ వెలుగు చూసింది; జనాదరణ పొందింది.
‘బహుదూరపు బాటసారి… ఇటు రావోయి ఒక్కసారి…’ అంటూ ఘంటసాల గానం చేసిన పాటలోని పల్లవి మొదటి పంక్తినే తమ సినిమా టైటిల్ గా చేసుకున్నారు దాసరి. కథలోకి తొంగిచూస్తే – ప్రసాద్ ఓ సిన్సియర్ పోలీస్ ఇన్ స్పెక్టర్. ఆయన భార్య ప్రభ. వారి పిల్లలు భాను, రాజా, సుహాసిని. అమ్మాయి మూగది. పిల్లలు సుఖంగా ఉండడం కోసం ప్రసాద్ సాదారణ జీవితం గడుపుతూ వారు ఆనందంగా ఉండేలా చూస్తూ ఉంటాడు. ప్రసాద్ పిల్లల కోసం నీతిగా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటే, అతని పక్కనే ఉన్న అవతారం డబ్బులు ఇస్తే పిల్లలు చెడిపోతారని భార్యను, కొడుకులను క్రమశిక్షణ పేరుతో నానా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ప్రసాద్ పిల్లలు పెరిగి పెద్దవారై తాము కోరుకున్న అమ్మాయిలను పెళ్ళాడతారు. మూగ అమ్మాయి సుహాసినిని, మూగవాడైన నారాయణరావు పెళ్ళాడతాడు. ప్రసాద్ కు యాక్సిడెంట్ కారణంగా కాలు పోతుంది. దాంతో సర్వీస్ నుండి తొలగవలసి వస్తుంది. పిల్లలు నిరాదరిస్తారు. అయితే వారి అండ లేకుండానే జీవితం సాగించాలని పట్టుదలతో ప్రసాద్ ముందుకు పోతాడు. ఓ ధనవంతుని ప్రసాద్ రక్షిస్తాడు. తన ప్రాణాలు కాపాడిన ప్రసాద్ కోసం ఆ ధనికుడు వ్యాపారం చేయమంటాడు. ప్రసాద్ కు కలసి వస్తుంది. లక్షాధికారి అవుతాడు. పిల్లలు మళ్ళీ తండ్రి దగ్గరకు రావాలని చూస్తారు. అది ప్రసాద్ కు ఇష్టం ఉండదు. కానీ, భార్య రాణిస్తుంది. భార్య తన మాట కాదని, నిర్దయులైన పిల్లలను రానివ్వడం ప్రసాద్ కు నచ్చదు. దాంతో ఆస్తి మొత్తం భార్యపేరిట రాసి, ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు ప్రసాద్. ప్రభ, ప్రసాద్ ఉత్తరం చదివి అతని కోసం పరుగు తీస్తుంది. పిల్లలు మారిపోయి, తాము కూడా తండ్రిలాగా తమ కాళ్ళపై తాము నిలబడతామని వస్తారు. క్షమించమని వేడుకుంటారు. వారితో పాటు అవతారం కూడా వచ్చి, పిల్లలను క్షమించమంటాడు. వారి ప్రయాణం తమతో కాదని, నీతిగా ఎవరి కాళ్ళపై వాళ్ళు నిలబడాలని చెప్పి, భార్యతో కలసి ప్రసాద్ పడమరవైపు సాగిపోవడంతో కథ ముగుస్తుంది.
దాసరి భార్య పద్మ సమర్పణలో తారకప్రభు ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో ఏయన్నార్ సరసన సుజాత నటించారు. దాసరి నారాయణరావు, రాజా, భానుచందర్, సుమలత, సుహాసిని, నారాయణరావు, ఆర్.నారాయణమూర్తి, అల్లు రామలింగయ్య, రమాప్రభ, జయమాలిని, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, పేకేటి తదితరులు నటించారు. పాలగుమ్మి పద్మరాజు, ఆర్.కె.ధర్మరాజు రాశారు. సంగీతం రమేశ్ నాయుడు సమకూర్చిన ఈ చిత్రానికి మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకునిగా దాసరి నారాయణరావు వ్యవహరించారు. ఇందులోని “పంపానది తీరాన… శబరిమల పీఠాన…”, “అలమటించి పోతున్నానోయ్…”, “ఎవరు ఎవరో తెలియకుండా…”, “మేఘమా…నీలిమేఘమా…”, “ఎక్కడి తలుపులు అక్కడనే మూసెయ్…” అంటూ సాగే పాటలు అలరించాయి. ‘బహుదూరపు బాటసారి’ మంచి విజయం సాధించింది. అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ఈ చిత్రం ద్వారా ఉత్తమ గాయకునిగా ఎస్పీ బాలుకు, ఉత్తమ కథకునిగా ఆర్.కె.ధర్మరాజుకు నంది అవార్డులు లభించాయి.
