Naga Chaitanya : ఢిల్లీ హైకోర్టులో అక్కినేని నాగచైతన్యకు ఊరట

Naga Chaitanya

Naga Chaitanya

టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కోర్టు మెట్లెక్కారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తున్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై  చర్యలు తెసుకోవాలని తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు మరియు వాయిస్‌ను దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ‘పర్సనాలిటీ రైట్స్’ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు నాగచైతన్యకు అనుకూలంగా కీలక ఆదేశాలు జారీ చేసింది.

 కొన్ని వెబ్‌సైట్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు తన పేరును, సినిమాలలోని సీన్స్ ను అసభ్యకరమైన రీతిలో వాడుతున్నాయని నాగచైతన్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి సృష్టించిన అనధికారిక కంటెంట్, డీప్‌ఫేక్స్ మరియు తన పోలికలతో ఉన్న వస్తువులను  ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ తన ప్రతిష్టకు, పరువుకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సెలబ్రిటీ హోదాను అడ్డుపెట్టుకుని కొందరు చేస్తున్న వాణిజ్య ప్రకటనలు, పోస్టులు తన వ్యక్తిగత జీవితాన్ని సైతం ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని పేర్కొన్నారు.

×
×
Ad

ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫేస్, పేరును అశ్లీల కంటెంట్‌లో లేదా  యాడ్స్ కోసం వాడటం పర్సనాలిటీ రైట్స్‌తో పాటు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును ఉల్లంఘించడమేనని  నాగచైతన్య తరఫున సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్ హైకోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం.. నాగచైతన్యకు తాత్కాలిక రక్షణ కల్పిస్తూ అశ్లీల సైట్లు మరియు సదరు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే చైతన్య వ్యక్తిగత జీవితంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న లింకులను తొలగించాలని ఆదేశిస్తూ ప్రతివాదులందరికీ కోర్టు నోటీసులు పంపింది. ఇటీవలి కాలంలో టాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్,  నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున కూడా ఇదే తరహాలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి తమ పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడుకోగా ఇప్పుడు నాగచైతన్య సైతం అదే బాటలో లీగల్ షీల్డ్ పొందారు.