NTV Telugu Site icon

పాతికేళ్ళ ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’

Akkada Ammayi Ikkada Abbayi Completes 25 Years

(అక్టోబర్ 11న ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’కి 25 ఏళ్ళు)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు రామలింగయ్య సమర్పణలో అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ నాయికగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నతమ్ముడుగా కళ్యాణ్ ఈ సినిమాతో పరిచయం కావడం చిరు అభిమానులకు మహదానందం కలిగించింది. పైగా అప్పటికే కళ్యాణ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ వంటివి సాధించి, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించడని తెలియడంతో ఫ్యాన్స్ మరింతగా సంతోషిస్తూ, ఆయనకు స్వాగతం పలికారు. 1996 అక్టోబర్ 11న విడుదలైన ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ చిత్రం మంచి విజయం సాధించి, అభిమానులకు ఆనందం పంచింది.

‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ చిత్రం హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ ఆధారంగా తెరకెక్కింది. ఇక అసలు కథ విషయానికి వస్తే – ఓ గ్రామంలో హరిశ్చంద్రప్రసాద్, విష్ణుమూర్తి బద్ధ శత్రువులు. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. అందుకు కారణం – విష్ణుమూర్తి చెల్లెలును హరిశ్చంద్రప్రసాద్ తమ్ముడు ప్రేమించి మోసం చేసి ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటూ విషయం అన్నలతో చెబుతుంది. విష్ణుమూర్తి ఆగ్రహంతో వెళ్ళి పెళ్ళి పీటల మీదున్న హరిశ్చంద్రప్రసాద్ తమ్ముణ్ణి చంపుతాడు. విష్ణుమూర్తికి 14 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది. తరువాతి రోజుల్లో హరిశ్చంద్రప్రసాద్ కూతురు సుప్రియ, విష్ణుమూర్తి తనయుడు కళ్యాణ్ ఒకే కాలేజ్ లో చదువుతుంటారు. ఇద్దరూ ఒకరంటే ఒకరు ద్వేషించుకుంటూ పందేలు కట్టుకుంటూ ఉంటారు. కళ్యాణ్ తో ఓ పందెంలో సుప్రియ ఓడిపోతుంది. తరువాత మెల్లగా ప్రేమలో పడతారు. అదే సమయంలో విష్ణుమూర్తి జైలు శిక్ష అనుభవించి విడుదలై బయటకు వస్తాడు. అందువల్ల ఇరు కుటుంబాలు కళ్యాణ్, సుప్రియ ప్రేమను అంగీకరించవు. దాంతో లేచిపోతారు. తరువాత ఇరు వర్గాలు వారి కోసం వెతుకుతారు. చివరకు వైరివర్గాల మధ్య పోరు తప్పదు. ఈ నేపథ్యంలో ఓ గొయ్యిలో పడబోతున్న హరిశ్చంద్ర ప్రసాద్ ను విష్ణుమూర్తి కాపాడతాడు. దాంతో అందరి మధ్య సఖ్యత నెలకొంటుంది. కళ్యాణ్, సుప్రియ ప్రేమ కూడా ఫలిస్తుంది. దాంతో కథ సుఖాంతమవుతుంది.

ఈ చిత్రంలో కళ్యాణ్, సుప్రియ అసలు పేర్లతోనే నటించడం విశేషం. అప్పుడు ‘పవన్’ అన్న పేరు ఇంకా కళ్యాణ్ కు ముందు చేరలేదు. ఇక హరిశ్చంద్రప్రసాద్ గా నాజర్, విష్ణుమూర్తిగా శరత్ బాబు నటించారు. ఊహ, రాజా రవీందర్ ప్రేమజంటగా సినిమా ఆరంభంలో కనిపించారు. కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, బాబూ మోహన్, మల్లికార్జునరావు, ఏవీయస్, గోకిన రామారావు, తిరుపతి ప్రకాశ్, ఐరన్ లెగ్ శాస్త్రి, అశోక్ కుమార్, కవిత, కల్పనా రాయ్ ఇతర తారాగణం.

ఈ చిత్రానికి మాటలు సత్యానంద్, పాటలు వేటూరి రాశారు. కోటి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని “ప్రియసఖి ఓమ్…”, “టైమ్ టైమ్…”, “బావా బావా…”, “చలిగా ఝుమ్మంది…”, “ప్రేమన్న చిన్నమాటలోనే…”, “ముద్దు ముద్దు పిల్లో…”, “ఓ దైవమా…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి. రంభ ఓ పాటలో చిందేసి కనువిందు చేసింది.

ఇక అసలు విషయానికి వస్తే – ఆమిర్ ఖాన్, ఆయన అంకుల్ నాజిర్ హుస్సేన్ కలసి ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ చిత్రకథను రూపొందించుకున్నారు. 1988లో విడుదలైన ఆ సినిమా ఘనవిజయం సాధించింది. అయితే అందులో చివరకు హీరో, హీరోయిన్ ఒకరికోసం ఒకరు మరణించడంతో కథ విచారంతో ముగుస్తుంది. ఇదే కథను మళయాళీ దర్శకుడు సిద్ధిక్ లాల్ తమ వాతావరణానికి అనువుగా కొన్ని మార్పులూ చేర్పులూ చేసి సుఖాంతంగా ‘గాడ్ ఫాదర్’ అనే కథను తయారు చేసుకున్నారు. 1991లో వచ్చిన ఆ సినిమా కూడా మళయాళ సీమలో ఘనవిజయం సాధించింది. దానినే తెలుగులో జగపతిబాబుతో ‘పెద్దరికం’గా తెరకెక్కించారు. 1992లో రూపొందిన ఈ సినిమాతోనే నిర్మాత ఎ.ఎమ్.రత్నం దర్శకుడయ్యారు. ఇది కూడా మంచి విజయం సాధించింది. ఆ తరువాత నాలుగేళ్ళకు ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ జనం ముందు నిలచింది. ఈ సినిమాకు కళ్యాణ్ అసలు ఆకర్షణ. ఇందులో అతను ప్రదర్శించిన మార్షల్ ఆర్ట్స్ ఫ్యాన్స్ ను భలేగా ఆకట్టుకున్నాయి. తమ అభిమాన కథానాయకుడు చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ నటించిన తొలి చిత్రం కాబట్టి, ఫ్యాన్స్ పదే పదే ఈ సినిమాను చూశారు. దాంతో అభిమానుల ఆదరణతో ఈ చిత్రం విజయపతాకం ఎగురవేసింది.

Show comments