Akhil’s Lenin Pre-Release Event in Tirupati: అక్కినేని అఖిల్ హీరోగా, అందాల తార భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ కెరీర్‌లో ఎంతో కీలకంగా భావిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలలో మరింత వేగవంతం చేసింది.
ఇప్పటికే విడుదలైన ‘లెనిన్’ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్స్, నాగార్జున వాయిస్ ఓవర్‌తో రూపొందిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదికను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూలై 5న తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారు? అనే విషయాన్ని మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. దీంతో టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో లేదా ప్రముఖ దర్శకుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తారా? లేదా చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరుగుతుందా? అనే అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూర్చగా.. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి బజ్ తీసుకు రాగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఆ హైప్‌ను మరింత పెంచాలని చిత్రబృందం భావిస్తోంది. ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ ఎంతో నమ్మకంతో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.

