తాత ఏయన్నార్ మహానటుడు. తండ్రి నాగార్జున టాప్ స్టార్. అన్న నాగచైతన్య యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించాడు. ఇక మిగిలింది అక్కినేని అఖిల్ వంతు. ఏడాది దాటిన వయసులోనే అఖిల్ ‘సిసింద్రీ’గా జనాన్ని మెప్పించాడు. అప్పటి నుంచీ అక్కినేని ఇంట మరో ప్రతిభావంతుడు పుట్టాడని జనం భావించారు. దోగాడే పసిపాపగా ఉన్న రోజుల్లోనే అలరించిన అఖిల్ కథానాయకునిగానూ మెప్పిస్తాడని అభిమానులు ఆశించారు. ఎందుకనో వారి ఆశలు అంతగా ఫలించలేదు. గత యేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’గా జనం ముందు నిలచి తొలి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అఖిల్. ఇప్పుడు ‘ఏజెంట్’గా మురిపించే ప్రయత్నంలో ఉన్నాడు అఖిల్.
అఖిల్ అక్కినేని 1994 ఏప్రిల్ 8న కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో జన్మించాడు. అక్కినేని నాగార్జున, అమల దంపతుల నోముల పంటగా జన్మించిన అఖిల్ సంవత్సరం వయసులోనే ‘సిసింద్రీ’ చిత్రంలో నటించి అలరించాడు. ఆ తీరును ఇప్పటికీ అభిమానులు మరచిపోలేరు. అమ్మ అమల, నాన్న నాగార్జున – ఇద్దరూ తెరపై మేటి నటీనటులుగా వెలిగారు. వారి జీన్స్ అఖిల్ ను సినిమా రంగంవైపే పరుగులు తీయించాయి. చిత్రసీమలోకి యంగ్ హీరోగా అడుగుపెట్టక ముందు అఖిల్ క్రికెట్ లో భలేగా రాణించాడు. ఆస్ట్రేలియా వెళ్ళి మరీ క్రికెట్ లో శిక్షణ తీసుకున్నాడు. ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ కోసం టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ ఆడిన సమయంలో అఖిల్ కూడా బ్యాటింగ్ చేసి జనాన్ని ఆకట్టుకున్నాడు. అప్పట్లో అఖిల్ ఏ జట్టులో ఉంటే ఆ టీమ్ గెలుస్తుందని సినీజనం భావించేవారు.
అఖిల్ క్రికెట్ లో అలరించింది మొదలు అక్కినేని అభిమానులు అఖిల్ ను తెరపై చూడాలని ఆశిస్తూనే ఉన్నారు. అభిమానుల కోరిక తీర్చడానికి అన్నట్టు అక్కినేని హీరోలు అందరూ కలసి నటించిన ‘మనం’ చిత్రంలో తాత, తండ్రి, అన్నతో కలసి ఓ సీన్ లో కాసేపు కనిపించాడు. అందులో అఖిల్ ఎంట్రీ చూసిన అభిమానులు ఆనందంతో చిందులు వేశారు. తరువాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సోలో హీరోగా ‘అఖిల్’మూవీతో ప్రేక్షకుల ముందు నిలిచాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తరువాత ‘హలో’తో ఆకట్టుకొనే ప్రయత్నం చేయగా అదీ అంతగా అలరించలేదు. ఇక తమ అక్కినేని ప్యామిలీకి అచ్చి వచ్చిన ‘మజ్ను’ టైటిల్ ను తగిలించుకొని ‘మిస్టర్ మజ్ను’ని నేనేనంటూ వచ్చాడు. అదీ నిరాశనే మిగిల్చింది. సోలో హీరోగా మూడు సినిమాలతోనూ ఆకట్టుకోలేకపోయిన అఖిల్ నాల్గవ చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో తొలి విజయాన్ని అందుకున్నాడు. మరి ఈ పుట్టినరోజు తరువాత అఖిల్ ‘ఏజెంట్’గా ఆగస్టు 12న జనం ముందు నిలువనున్నాడు. ఒకసారి సక్సెస్ పలకరించింది కదా, తరువాత కూడా విజయపథంలోనే అఖిల్ సాగుతాడని అభిమానుల అభిలాష. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఏజెంట్’ అఖిల్ కు ఎలాంటి ఆనందం పంచుతుందో చూడాలి.
