‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో భారీ హిట్ ని అందుకున్న అఖిల్ జోరు పెంచేశాడు. ఈ సినిమా తరువాత అఖిల్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు కరోనా బ్రేకులు వేసింది. ఇటీవల డైరెక్టర్ సురేందర్ రెడ్డి కరోనా బారిన పడడంతో కొద్దిరోజులు షూటింగ్ ని వాయిదా వేశారు మేకర్స్. ఇక దీనివల్లనే రిలీజ్ డేట్ లో కూడా మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఏజెంట్ రిలీజ్ డేట్ మారిందని తెలుపుతూ ట్వీట్ చేశారు. ” అక్కినేని అభిమానులందరికి నమస్కారం.. కరోనా వలన మా ‘ఏజెంట్’ డేటు మారినా దర్జా మారదు.. దూకుడు మారదు.. ధీమా మారదు. అఖిల్ యాక్షన్, సురేందర్ రెడ్డి స్టైల్ తో ‘ఏజెంట్’ ప్రపంచ స్థాయి గూఢచారి సినిమాలతో సమానంగా ఉంటుంది. మీరు కలలు కంటున్న ప్రతిదాన్ని మేము 1000% అందజేస్తామని హామీ ఇస్తున్నాము” అని చెప్పుకొచ్చారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి అఖిల్ ఈ చిత్రంతో రెండో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
