అభిమానం ఉండాలే కానీ, ఎవరినైనా ఎప్పుడైనా ఇట్టే అభినందించవచ్చు. అక్షయ్ కుమార్ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడంటూ అజయ్ దేవగన్ తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా అభినందించారు. అక్షయ్ కుమార్ 30 ఏళ్ళుగా సినిమా రంగంలో ఉన్నందుకు, ఇంకెన్నో ఏళ్ళు ఉండాలనీ కోరుకుంటూ అజయ్ అభినందన సాగింది. ఇంతకూ ఈ రోజున అక్షయ్ ని అజయ్ ఎందుకు గుర్తు చేసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే, అక్షయ్ జీవితంలో మే 5వ తేదీ ప్రాముఖ్యం ఏమిటో అభినందించిన అక్షయ్ కే తెలియాలి. ఒకవేళ అక్షయ్ కుమార్ నటునిగా 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నారా అంటే, ఆయన గత సంవత్సరం జనవరి 25తోనే నటునిగా మూడు పదులు పూర్తి చేసుకున్నారు. ఎందుకంటే, అక్షయ్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ‘సౌగంధ్’ 1991 జనవరి 25న విడుదలయింది. ఇక అక్షయ్ ను జనం మదిలో ‘ఖిలాడీ’గా నిలిపిన ‘ఖిలాడీ’ చిత్రం విడుదల తేదీ ఏమైనా అంటే అదీ కాదు. ఎలాగంటే ‘ఖిలాడీ’ 1992 జూన్ 5న విడుదలయింది. అంటే మరో మాసం రోజులకు అక్షయ్ జనం ముందు ‘ఖిలాడీ’గా నిలచి 30 ఏళ్ళు అవుతుందన్న మాట! బహుశా, ఈ విషయంలో ఏమైనా అజయ్ దేవగన్ తికమక పడ్డారో, లేక ఎవరైనా జూన్ 5 బదులుగా మే 5న ‘ఖిలాడీ’ వచ్చిందని ఆయనకు చెప్పారో?
ఏది ఏమైతేనేమి? మొత్తానికి ఈ మసాలా బాబులు (ఎందుకంటే పాన్ మసాలా యాడ్ లో అజయ్, అక్షయ్ ఇద్దరూ కలసి షారుఖ్ ఖాన్ తోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు) ఎలాంటి అనుబంధంతో ఉన్నారో ఈ ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. సరే, తన ఆప్తమిత్రునికి ఓ నెల రోజులు ముందుగానే గ్రీటింగ్స్ చెప్పడమే కాదు, తన స్నేహితుడు ఎన్నో రికార్డులు నెలకొల్పాలనీ ఆశించారు అజయ్. సదా అక్షయ్ ను అభినందించడానికి తోడుగా ఉంటాననీ అజయ్ సెలవిచ్చారు. సరే, అజయ్, అక్షయ్ మధ్య ఉన్న స్నేహబంధాన్ని మాత్రం అందరూ అభినందించకుండా ఉండలేక పోతున్నారు.