Aishwarya Rajinikanth New Movie Oh Saathi Chal Updates.
ధనుష్ తో విడాకుల తర్వాత కెరీర్ పై మరింతగా ఫోకస్ పెంచింది రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య. ధనుష్ తో 18 సంవత్సరాల వైవహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న ఐశ్వర్య ఇటీవల తన దర్శకత్వంలో ఓ మ్యూజిక్ వీడియో విడుదల చేసింది. దీనికి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ కూడా పని చేశారు. ఆ వీడియోకు ధనుష్ ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా ఐశ్వర్య బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన తొలి బాలీవుడ్ సినిమాకు ‘ఓ సాథీ చల్’ అనే టైటిల్ పెడుతున్నట్లు తెలుపుతూ ఈ చిత్రాన్ని మీను అరోరా నిర్మించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తానంటోంది ఐశ్వర్య. నిజానికి 2012లో ‘త్రీ’ సినిమాతో దర్శకురాలిగా మారింది ఐశ్వర్య.
ఆ తర్వాత 2015లో ‘వెయ్ రాజా వెయ్’ సినిమా తెరకెక్కించింది. ఇక 2017లో ‘సినిమా వీరన్’ అనే డాక్యుమెంటరీకి కూడా దర్శకత్వం వహించింది. ఇక ధనుష్ సైతం 2013లో ‘రాంఝానా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అతని మాజీ భార్య ఐశ్వర్య కూడా తనని అనుసరిస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఐశ్వర్య దర్శకురాలిగానే కాదు తమిళ సినిమాలు ‘విజిల్, ఆయిరత్తిల్ ఒరువన్’ సినిమాల్లో పాటలు పాడటమే కాదు ‘ఆయిరత్తిల్ ఒరువన్’ సినిమాలో రీమాసేన్ కి డబ్బింగ్ కూడా చెప్పటం విశేషం. మరి తన మాజీ భర్త ధనుష్ లాగే బాలీవుడ్ లోనూ రాణిస్తుందేమో చూడాలి.
