Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌!

Ahaan Panday Sharvari Ali Abbas Zafar

Ahaan Panday Sharvari Ali Abbas Zafar

Ahaan Panday Next Movie with Ali Abbas Zafar: బాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్‌ (వైఆర్ఎఫ్‌)కు ప్రస్తుతం వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. భారీ బడ్జెట్‌, స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ‘వార్‌ 2’, ‘ఆల్ఫా’, ‘మర్దానీ 3’ వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాల కంటే కొత్త జంటలు, విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. ఈ క్రమంలో ‘సైయారా’తో సంచలన విజయం అందుకున్న అహాన్‌ పాండేను మరోసారి రంగంలోకి దించుతోంది.

మోహిత్‌ సూరి దర్శకత్వంలో అహాన్‌ పాండే, అనీత్‌ పడ్డా జంటగా నటించిన ‘సైయారా’ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ మ్యూజికల్‌ లవ్‌స్టోరీ బాక్సాఫీస్‌ వద్ద అనూహ్య విజయాన్ని అందుకుంది. రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విజయంతో అహాన్‌ పాండేకు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించింది. మరోవైపు ఆ తర్వాత విడుదలైన ‘వార్‌ 2’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా.. సైయారా ఇచ్చిన ఊపుతో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌కు కొంత ఊరట లభించింది. దీంతో అహాన్‌తో మరో సినిమా చేయాలని నిర్మాణ సంస్థ నిర్ణయించింది.

సైయారా విజయం తర్వాత అహాన్‌ పాండేకు పలు సినిమా అవకాశాలు వచ్చాయి. దాదాపు పది కథలను పరిశీలించిన అనంతరం ఆయన దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ చిత్రానికి ‘బేపర్వా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో శర్వరి కథానాయికగా నటిస్తోంది. యాక్షన్‌, రొమాన్స్‌ కలగలిసిన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అలీ అబ్బాస్‌ గతంలో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌తో కలిసి విజయవంతమైన చిత్రాలను అందించారు. అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’ మాత్రం బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచింది. అయినప్పటికీ అలీ గత విజయాలను దృష్టిలో ఉంచుకుని ఆదిత్య చోప్రా మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చారు. భారీ చిత్రాలపై పెట్టుబడులు పెట్టి ఆశించిన ఫలితాలు అందుకోలేకపోతున్న యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌కు బేపర్వా కీలకంగా మారనుంది.