Aha: ఆహా ఓటీటీలో ఇప్పుడు పాపులర్ షోస్ సెకండ్ సీజన్ లోకి అడుగుపెడుతున్నాయి. అలా శుక్రవారం మొదలైంది ‘తెలుగు ఇండియన్ ఐడల్ -2’. మొదటి సీజన్ లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్రీరామచంద్ర స్థానంలోని ఈ సీజన్ లో హేమచంద్ర రాగా, న్యాయనిర్ణేతగా ఫస్ట్ సీజన్ లో వ్యవహరించిన నటి నిత్యా మీనన్ ప్లేస్ లోకి పాపులర్ తెలుగు సింగర్ గీతా మాధురి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు నగరాల్లో ఆడిషన్స్ జరిపి, ఫైనల్ లిస్ట్ ను తయారు చేసుకుని తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి సింగర్స్ ను ఆహ్వానించారు. అలా వచ్చిన కొద్దిమంది మొదటి ఎపిసోడ్ మొదటి రోజున తమ ప్రతిభను చూపారు.
దునియాను దున్నేయడానికి వచ్చేసింది తెలుగు ఇండియన్ ఐడిల్ అంటూ హేమచంద్ర శంఖం పూరిస్తూ, సమరం చేయాల్సిందిగా సింగర్స్ ను కోరారు. న్యాయనిర్ణేతలుగా తమన్, గీతామాధురి, కార్తిక్ ఎంటర్ అయ్యారు. ఎప్పటిలానే తమన్ తనదైన పంచ్ డైలాగ్స్ తో షోను ప్రారంభించారు. కుమ్మేస్తున్నాం… అంతే అంటూ అందరిలో కాన్ఫిడెన్స్ ను కలిగించాడు.
ఫస్ట్ సింగర్ గా 16 సంవత్సరాల కార్తీకేయ అవసరాల అడుగుపెట్టాడు. ‘కడలి’ మూవీ కోసం ఎ.ఆర్. రెహమాన్ స్వరపర్చగా, వనమాలి రాసిన ‘యాడికే…’ పాటను కార్తికేయ గానం చేశాడు. దీనిని సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడాడు. విశేషం ఏమంటే… ఫస్ట్ సీజన్ లో పదహారేళ్ళ వైష్ణవి కూడా ఇదే పాటను స్టేజ్ మీద పాడింది. ఆమెకు అప్పుడు గోల్డెన్ మైక్ లభించింది. ఇప్పుడీ సీజన్ లో కార్తికేయ పాట పాడటం పూర్తి చేయగానే నిర్వాహకులు వైష్ణవిని కూడా వేదిక మీదకు ఆహ్వానించారు. గడిచిన సీజన్ నుండి తన కెరీర్ లో వచ్చిన మార్పును వైష్ణవి తెలిపింది. తమన్ ‘గాడ్ ఫాదర్’లో పాట పాడే అవకాశం తనకిచ్చారని, అలానే ‘ఇంటింటి రామాయణం’ సినిమాలోనూ పాటలు పాడే ఛాన్స్ దక్కిందని తెలిపింది. ఇక కార్తీక్ తో కలిసి ఐదు భాషల్లో ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం పాడానని చెప్పింది. యు.ఎస్. కన్సర్ట్ కూడా విజయవంతం అయ్యిందని, తెలుగు ఇండియన్ ఐడల్ తో సింగర్ గా తన కెరీర్ మరో స్టేజ్ కు చేరుకుందని తెలిపింది వైష్ణవి. గీతామాధురి కోరిక మేరకు కార్తికేయ – వైష్ణవి ఇద్దరూ కలిసి ‘యాడికే…’ పాటను పాడారు.
రోజువారి కూలీగా పనిచేసే దిగువ మధ్యతరగతికి చెందిన రవికిరణ్ సైతం తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా సింగర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాడు. చక్కటి గాత్రం ఉన్న రవికిరణ్ ను ముగ్గురు న్యాయనిర్ణేతలు అభినందిస్తూ, గోల్డెన్ టిక్కెట్ ఇచ్చారు. మంచిగా 30 పాటలు నేర్చుకుంటే… సంగీత విభావరులకు తాను ఆహ్వానిస్తాంటూ గీతామాధురి… రవికిరణ్ కు హామీ ఇచ్చింది. గత సీజన్ లో ఛాన్స్ మిస్ అయిన హైదరాబాద్ కు చెందిన సాకేత్ ను ఈసారి తమన్ ప్రత్యేకంగా ఆహ్వానించాడు. సాకేత్ గాత్రానికి ముగ్దుడైనా కార్తీక్ చక్రవాక రాగంలో సాకేత్ లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చాడు. అంతేకాదు… అతనికి టాప్ 12లో చోటు ఇస్తూ… గోల్డెన్ మైక్ ను అందించాడు. మూడో కంటెస్టెంట్ గా వచ్చిన విశాఖపట్నంకు చెందిన అఖిల కూడా గోల్డెన్ టిక్కెట్ అందుకుంది.
కాస్తంత మెలోడి… కాస్తంత డ్రామా!
చేసే వృత్తితో సంగీతానికి ఎప్పుడూ సంబంధం ఉండదు. కాస్తంత స్వర పరిజ్ఞానం పాట పాడే గొంతు ఉంటే చాలు సింగర్స్ అయిపోవచ్చు. చక్రపాణి నగిరి కూడా అలాంటి వ్యక్తే. అతను బేసికల్ గా బి.ఎస్.ఎఫ్. కు చెందిన జవాన్. రాజస్థాన్ లో ఇండో – పాక్ బోర్డర్ లో కావలి కాసే సైనికుడు. బట్… అతనికి సంగీతం అంటే ప్రాణం. అందుకే ఈసారి తెలుగు ఇండియన్ ఐడల్ లో పాల్గొన్నాడు. ఓ సైనికుడు ఇలాంటి సింగింగ్ కాంపిటీషన్ లో పాడటం అంటే సంగీతానికి దక్కిన గౌరవమని తమన్ తెగ ఆనంద పడ్డాడు. ముగ్గురు న్యాయనిర్ణేతలూ అతని పాటను ఫిదా అయ్యి, గోల్డెన్ టిక్కెట్ ఇచ్చారు. అయితే తనకు శలవలు లేవని, వారి టిక్కెట్ ను స్వీకరించలేనని చక్రపాణి చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు. తమన్ చొరవ తీసుకుని చక్రపాణి పైఅధికారితో మాట్లాడి, శలవు పొడిగించేలా పర్మిషన్ తీసుకున్నాడు. గత సీజన్ లో మాదిరే ఇప్పుడు కూడా ఒకరిద్దరు వేదికపైకి వచ్చి కామెడీ చేసే ప్రయత్నం చేశారు. నంద్యాల నుండి వచ్చిన దొరబాబు ‘నాటు నాటు… ‘ పాట పాడి వినోదాన్ని పంచాడు. మొత్తానికీ అదిరిపోయే పెర్ఫార్మెన్స్, అన్ లిమిటెడ్ ఫన్ తో సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ సాగిపోయింది.
