Adurthi Subba Rao: తెలుగునాట ‘అఆలు’ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ‘అక్కినేని ఆలోచనలు’ పేరిట నటసమ్రాట్ రాసుకున్న జీవిత సత్యాలు. కానీ, సినీ అభిమానులకు ‘అఆలు’ అంటే ‘అన్నపూర్ణలో ఆదుర్తి చిత్రాలు’ అనే భావన ఉంది. అలాగే ‘అక్కినేనితో ఆదుర్తి సినిమాలు’ అనే విశ్వాసం కూడా వారి అభిమానులకు ఉండేది. ఏది ఏమైనా అన్నపూర్ణ సంస్థలో అక్కినేనితో ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయని చెప్పక తప్పదు.
‘అన్నపూర్ణ’ సంస్థలో సినిమాలు తీశాకే కుటుంబ కథా చిత్రాల దర్శకునిగా ఆదుర్తి సుబ్బారావు సుప్రసిద్ధులయ్యారు. 1912 డిసెంబర్ 16న జన్మించిన ఆదుర్తి సుబ్బారావు, తొలి నుంచీ కళారాధకులే! ఆయన తండ్రి రాజమండ్రి తాసిల్దార్ గా పనిచేశారు. కాకినాడ పి.ఆర్.కాలేజ్ లో పి.యు.సి., కాగానే సుబ్బారావు ముంబై వెళ్ళి అక్కడ సెయింట్ జేవియర్స్ కాలేజ్ లో ఫోటోగ్రఫీలో డిగ్రీ చేశారు. కొంతకాలం బాంబే ఫిలిమ్ ల్యాబ్ లో పనిచేశారు. తరువాత ప్రముఖ ఎడిటర్ దినా నర్వేకర్ వద్ద అసిస్టెంట్ గా ఉన్నారు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ అన్నిటా అసిస్టెంట్ గా పనిచేశారు ఆదుర్తి. ప్రఖ్యాత నృత్యకళాకారులు ఉదయ్ శంకర్ ‘కల్పన’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రోజుల్లో ఆయనకు అసిస్టెంట్ గా ఆదుర్తి ఉన్నారు. 1948లో రూపొందిన ‘కల్పన’ ఈ నాటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉండడం విశేషం. తరువాత ‘అమరసందేశం’ చిత్రంతో దర్శకుడయ్యారు ఆదుర్తి. ఆ సందేశాన్ని ఎవరూ ఆలకించలేదనే చెప్పాలి. తరువాత అన్నపూర్ణ వారి ‘తోడికోడళ్ళు’కు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలోనే పాటల చిత్రీకరణతో ఆకట్టుకున్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అటుపై అన్నపూర్ణ సంస్థలో వరుసగా విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు ఆదుర్తి. అన్నపూర్ణలో ఆదుర్తి సుబ్బారావు మొత్తం 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో 9 తెలుగు సినిమాలు, 3 తమిళ చిత్రాలు ఉన్నాయి. ఏయన్నార్ తో ఈ పన్నెండు చిత్రాలతో పాటు మరో ఎనిమిది సినిమాలు తెరకెక్కించారు ఆదుర్తి. అలా అక్కినేనితో ఎక్కువ చిత్రాలకు పనిచేసిన దర్శకునిగా నిలచిపోయారు. ఏయన్నార్ తో “తోడికోడళ్ళు, మాంగల్యబలం, నమ్మినబంటు, మంచిమనసులు, మూగమనసులు, పూలరంగడు, విచిత్రబంధం” వంటి రజతోత్సవ చిత్రాలు రూపొందించారు ఆదుర్తి.
యన్టీఆర్ తో రెండే రెండు సినిమాలు తీశారు ఆదుర్తి. అవి “దాగుడుమూతలు, తోడు-నీడ'”. ఈ రెండూ శతదినోత్సవ చిత్రాలే! కృష్ణను ‘తేనెమనసులు’లో తెరకు పరిచయం చేసింది ఆదుర్తి సుబ్బారావే. తరువాత కృష్ణతో “కన్నెమనసులు, మాయదారి మల్లిగాడు, గాజుల కిష్టయ్య” వంటి చిత్రాలు రూపొందించారు. శోభన్ బాబు హీరోగా ‘గుణవంతుడు’ తెరకెక్కించారు ఆదుర్తి. కొత్తవారు ప్రధాన పాత్రల్లో చిత్రాలు రూపొందించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు ఆదుర్తి సుబ్బారావు. ‘తేనెమనసులు’లో కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణితో ప్రధాన పాత్రలు పోషింప చేసి, వారిని పరిచయం చేశారు. తరువాత ‘సుడిగుండాలు’లో విజయ్ చందర్ ను , మాస్టర్ అక్కినేని నాగార్జునను పరిచయం చేశారు.
తెలుగులో ఆదుర్తి తెరకెక్కించిన ‘మూగమనసులు’ అనూహ్య విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ఆదుర్తి దర్శకత్వంలోనే ‘మిలన్’ టైటిల్ తో ఎల్.వి.ప్రసాద్ హిందీలో నిర్మించారు. అందులో జమున పాత్రలో ఆమెనే నటింప చేశారు. ‘మిలన్’ సైతం మంచి విజయం సాధించింది. దాంతో “మన్ కే మీట్, డోలి, దర్పణ్, మస్తానా, రఖ్వాలా, జీత్, ఇన్ సాఫ్, జ్వార్ భాట, సునేహ్రా సంసార్” చిత్రాలను హిందీలో రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1964లో తొలిసారి సినిమా అవార్డులు ప్రవేశ పెట్టింది. అందులో బంగారు నంది అవార్డు అందుకున్న మొట్టమొదటి చిత్రంగా ఆదుర్తి తెరకెక్కించిన ‘డాక్టర్ చక్రవర్తి’ నిలచింది. 1967లో ఆదుర్తి తెరకెక్కించిన ‘సుడిగుండాలు’కు కూడా బంగారు నంది లభించింది. ఉత్తమ తెలుగు చిత్రాలుగా నేషనల్ అవార్డు అందుకున్న ఆదుర్తి సినిమాలు “తోడికోడళ్ళు, మాంగల్యబలం, నమ్మినబంటు, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు”.
తమిళంలో ఆదుర్తి దర్శకత్వంలో రూపొందిన ‘కుముదమ్’ కూడా ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. ఇదే చిత్రం తరువాత ఆయన దర్శకత్వంలోనే తెలుగులో ‘మంచిమనసులు’గా తెరకెక్కింది. ఏయన్నార్ చిత్రాలతోనే దర్శకునిగా జయకేతనం ఎగురవేసిన ఆదుర్తి, నటసమ్రాట్ నటించిన ‘మహాకవి క్షేత్రయ్య’కు దర్శకత్వం వహిస్తూ కన్నుమూశారు. తరువాత సి.ఎస్.రావు ఆ సినిమాను పూర్తి చేశారు. ఏది ఏమైనా ‘అక్కినేనితోనూ, అన్నపూర్ణ సంస్థతోనూ ఆదుర్తిసుబ్బారావు అనుబంధం’ మరువరానిది, మరపురానిది. తెలుగువారికి ఆదుర్తి అందించిన ‘అఆలు’ను ఎవరూ మరచిపోలేరు.