Site icon NTV Telugu

హృదయం బ్రద్ధలైందంటున్న అడివి శేష్!

సినిమా వాళ్ళు సున్నిత మనస్కులు. చిన్న సంఘటన జరిగినా త్వరగా చెలించిపోతారు. కానీ అలాంటి సినిమా వాళ్ళే ఒక్కోసారి తమ ముందే అతి పెద్ద దారుణం జరిగినా స్పందించారు. ఆ కోవకు తాను చెందనని అంటున్నాడు అడివి శేష్. గత కొన్ని రోజులుగా ఆఫ్ఠనిస్థాన్ లో తాలిబన్లు చేస్తున్న దారుణ మారణ కాండను తెలియచేసే ఓ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి… ఆ లేఖ తన హృదయాన్ని బ్రద్దలు చేసిందని పేర్కొన్నాడు అడివి శేష్. ఆ లేఖ రాసిన యువతి ఆఫ్ఠనిస్థాన్ ఫిల్మ్ మేకర్ సహ్రా కరిమి.

ప్రస్తుతం సినిమా రంగాన్ని, కళలను నమ్ముకున్న వారి స్థితి ఆఫ్ఠనిస్థాన్ లో ఎంత దారుణంగా ఉందో ఆ లేఖలో సహ్రా కరిమి కళ్ళకు కట్టినట్టు తెలిపింది. సినిమా రంగానికి చెందిన రచయితలను, నటులను తాలిబన్లు అతి కిరాతకం చంపేస్తున్నారని, ఎంతో మంది మహిళలను మానభంగం చేశారని, చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి అమ్మేస్తున్నారని వాపోయింది. అతి త్వరలోనే ఆఫ్ఠనిస్థాన్ ను పూర్తిగా వారు ఆక్రమించుకుంటే… తమ నిస్సహాయ స్థితిని ప్రపంచానికి కూడా తెలియచేయలేమని ఆ లేఖలో పేర్కొంది. ప్రపంచంలో సినిమాను ప్రేమించే వారు, సినిమా రంగానికి చెందిన వారు దయచేసి మౌనంగా ఉండకుండా, తమ దీన స్థితిని గుర్తించి, తాలిబన్ల నుండి తమ ప్రజలను, ముఖ్యంగా అక్కడి సినిమా రంగానికి చెందిన వ్యక్తులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నానికి సహకరించమని సహ్రా కరిమి ఆ లేఖ ద్వారా వేడుకుంది. ఆ లేఖను చదివి వదిలేయకుండా, వీలైనంత మందికి చేరేలా షేర్ చేయమని ప్రార్థించింది. ఓ మానవతా వాదిగా అడివి శేష్ తన హృదయ స్పందనను తెలియచేశాడు. ఆమె లేఖను షేర్ చేశాడు. మరి సాటి మహిళా దర్శకురాలి విన్నపాన్ని ఎంతమంది ఆలకిస్తారో చూడాలి.

Exit mobile version