ముంబై అటాక్ లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాను శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీని మే 27న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లోనే అదే రోజున జనం ముందుకు తమ సినిమా వస్తుందని నిర్మాతలు అన్నారు. అయితే అదే తేదీన వెంకటేశ్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ మూవీ సైతం విడుదల అవుతోంది. దాంతో ‘మేజర్’ను ఇప్పుడు ఓ వారం పోస్ట్ పోన్ చేసి జూన్ 3న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
అయితే… జూన్ 3న కూడా ‘మేజర్’కు దేశ వ్యాప్తంగా గట్టి పోటీ ఉండబోతోంది. ఇప్పటికే జూన్ 3న అజయ్ దేవ్ గన్ ‘మైదాన్’ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించాడు. అలానే అక్షయ్ కుమార్ హీరోగా చంద్రప్రకాశ్ ద్వివేది రూపొందించిన ‘పృథ్వీరాజ్’ మూవీ సైతం అదే తేదీన విడుదల కాబోతోంది. దీన్ని కూడా ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తామని అంటున్నారు. ఇక కమల్ హాసన్ సొంత బ్యానర్ లో రూపుదిద్దుకున్న యాక్షన్ డ్రామా ‘విక్రమ్’ సైతం జూన్ 3నే రిలీజ్ అవుతోంది. సో… కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళ భాషల్లోనూ ‘మేజర్’ కు పోటీగా పలు చిత్రాలు విడుదల కానున్నాయి. ఇందులో ‘మైదాన్’ ఓ ఫుట్ బాల్ కోచ్ నిజ జీవిత కథతో తెరకెక్కింది. అలానే ‘పృథ్వీరాజ్’ చారిత్రక చిత్రం. ఇక ‘మేజర్’ అయితే దేశం కోసం అసువులు బాసిన సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. కమల్ హాసన్ ‘విక్రమ్’ ఫిక్షనల్ మూవీ. మరి వీటిల్లో ప్రేక్షకులు ఏ యే చిత్రాలవైపు మొగ్గుచూపుతారో చూడాలి.
