యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రామాయణగాథ `ఆదిపురుష్` టీజర్ అత్యంత ఘనంగా అయోధ్యలో ఆవిష్కృతమయింది. ఈ టీజర్ క్షణాల్లోనే నెట్ లోనూ దర్శనమిచ్చింది. `ఆదిపురుష్` మొదటి నుంచీ రామాయణగాథ ఆధారంగా రూపొందుతోందని అందరికీ తెలుసు. టీజర్ చూడగానే `జై శ్రీరామ్` అంటూ పులకించే భక్తకోటికి భ్రుకుటి ముడిపడడం ఖాయం. ఎందుకంటే ఇందులో రఘురాముని పాత్రధారి ప్రభాస్ మీసాలతో కనిపించడమే. అలాగే రావణాసురుడి గెటప్ లోఉన్న సైఫ్ అలీఖాన్ మోడరన్ హెయిర్ కట్ తోనూ కనిపిస్తాడు.
టీజర్ లో ఆకట్టుకొనే అంశాలేవీ అంటే గ్రాఫిక్స్ అనే చెప్పాలి. రాఘవుడు తపస్సు చేస్తూ టీజర్ మొదలవుతుంది. తరువాత రాక్షస సంహారం, పదితలల రావణాసురుడు, హనుమంతుడు, భల్లూకరాజయిన జాంబవంతుడు కూడా గతంలో మన భారతీయ చిత్రాలలో చూడని రామాయణగాథను తలపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే టీజర్ చూడగానే మన భారతీయ పురాణగాథకు వెస్టరన్ టచ్ ఇచ్చినట్టుగా ఉంది.
Read Also: Adipurush Teaser Launch Live: ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ లైవ్
చారిత్రక, పురాణ పాత్రలను మనం చూడలేదు కాబట్టి, మనకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోవడంలో కాసింత స్వేచ్ఛను సినిమావాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. గతంలో కె.రాఘవేంద్రరావు `అన్నమయ్య`ను తెరకెక్కించినప్పుడు అందరికీ సుపరిచితమైన గెటప్ తో పాటే అన్నమయ్యకు మీసాలు కూడా పెట్టారు. కొందరు తప్పు పట్టినా, తరువాత ఆ సినిమాకు జైకొట్టారు. కానీ, ఇక్కడ `ఆదిపురుష్`లోని రాఘవుడు రఘుపతి రాఘవ రాజారాముడు, పతిత పావన సీతారాముడు. ఆయన అంటే హిమవన్నగాల ఆవల ఈవల కూడా కోట్లాది మందికి భక్తి ప్రపత్తులు ఉన్నాయి. కానీ, `ఆదిపురుష్` దర్శకుడు ఓం రౌత్ సాహసం చేసి మరీ రఘురామునికి మీసాలు పెట్టారు. బహుశా, గ్రాఫిక్ మాయాజాలంతో జనాన్ని ఆకట్టుకుంటాననే ధీమా ఆ దర్శకుడికి ఉండవచ్చు.
భారతీయ పురాణగాథలను తెరకెక్కించడంలో తెలుగువారిదే పైచేయి. రాముడు నీలమేఘశ్యాముడు అన్న పురాణ పంక్తుల ఆధారంగానే మన తెలుగు సినిమాల్లో శ్రీరాముడు నీల మేఘశ్యామునిగానే దర్శనమిస్తాడు. కానీ, ఉత్తరాదివారు రాముని ఎర్రగా చూపించిన దాఖలాలూ ఉన్నాయి. కావున, ఈ `ఆదిపురుష్` టీజర్ ఉత్తరాది వారికి ఏమో కానీ, దక్షిణాదిన ముఖ్యంగా తెలుగువారికి పురాణాన్ని తప్పుగా తీసినట్టుగా భావించే ఆస్కారమే ఉంది. ఈ సినిమా రాబోయే 2023లో జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరి జనం గ్రాఫిక్ మాయాజాలానికే జైకొడతారో, లేక తమ సెంటిమెంట్ నే నమ్ముతారో చూడాలి.