దర్శక ధీరుడు రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’లోని పాట కోసం ఎన్టీయార్, రామ్ చరణ్ అభిమానులే కాదు… గ్రేట్ ఫిల్మ్ మేకర్ రాజమౌళి సినీ అభిమానులు సైతం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారన్నది వాస్తవం. బహుశా అందుకే కాబోలు ముందు చెప్పిన దానికంటే ఓ గంట ముందే ‘నాటు పాట’ను ‘ట్రిపుల్ ఆర్’ మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను చూసి చూడగానే సమంత ఠక్కున దీన్ని షేర్ చేస్తూ ‘మెంటల్’ అంటూ కామెంట్ చేసింది. అందుకు ఆమెకు కృతజ్ఞత చెబుతూ ‘ట్రిపుల్ ఆర్’ ట్విట్టర్ హ్యాండిల్ టీమ్ దానిని రీ ట్వీట్ చేసింది.
కేవలం సమంత మాత్రమే కాదు… మన యంగ్ డైరెక్టర్స్ చాలామంది ఈ పాట మీద తమ కామెంట్స్ ను ట్వీట్ చేశారు. ఈ పాటకు థియేటర్లలో విస్పోటనం ఖాయం అంటూ మలినేని గోపీచంద్ కామెంట్ చేస్తే, ‘ఇది ఊరనాటు’ అంటూ అనిల్ రావిపూడి ప్రశంసించాడు. మరో యువ దర్శకుడు బాబీ ‘వాట్ ఏ ఊరనాటు సాంగ్ దిస్ ఈజ్!’ అని పోస్ట్ చేశాడు. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, ‘నాటు’కు పోయింది పాట! అంటూ కవితాత్మకంగా చెప్పాడు. మొత్తానికి బిగ్గెస్ట్ మాస్ యాంథమ్ ఆఫ్ ది డికెడ్ గా ఈ పాట నిలిచిపోవడం ఖాయమనిపిస్తోంది. సినిమాలోని ప్రధాన తారగణం సైతం ఈ పాట లింక్ ను తమ తమ సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేశారు. దాంతో డిజిటల్ మీడియాలో ఈ నాటు సాంగ్ దావానలంలా వ్యాపించేస్తోంది!