The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’

Raasi

Raasi

ఒకప్పుడు టాలీవుడ్‌లో తనదైన నటనతో, గ్లామర్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ నటి రాశీ.. ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. కంటెంట్ బేస్డ్ చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో, పూర్తి విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రంలో ఆమె ఒక అత్యంత పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి రాశీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, నెట్టింట ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సినిమాలో రాశీ ‘సావిత్రి’ అనే పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

గెటప్ చాలా సింపుల్ అండ్ నేచురల్‌గా ఉన్నప్పటికీ.. ఆమె లుక్‌లో ఉన్న ఇంటెన్సిటీ మాత్రం సినిమా స్థాయిని పెంచేసింది. ఒక మిస్టీరియస్ బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ కథలో రాశీ పోషిస్తున్న ఈ సావిత్రి పాత్రే అత్యంత కీలకం అని, కథను ఊహించని మలుపు తిప్పేది ఈ క్యారెక్టరే అని చిత్ర యూనిట్ బల్లగుద్ది చెబుతోంది. ‘మెమరీ మేకర్స్’ బ్యానర్‌పై నూతన నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతకు ఇది మొదటి సినిమానే అయినప్పటికీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కించారు. రవి కుమార్ సీరపు ఈ వినూత్నమైన థ్రిల్లర్‌కు కథ, కథనం అందిస్తూ దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కబీర్ సింగ్ లాంటి స్టార్ విలన్‌తో పాటు పలువురు ప్రతిభావంతులైన నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.