Mandakini: ఒక్క ఫోటో.. ఎన్నో రూమర్లు.. చివరకు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ వివాదంపై సీనియర్ నటి మందాకిని స్పందించారు. ‘రామ్ తేరీ గంగా మైలీ’ సినిమాతో అప్పట్లో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌గా మారిన ఆమె, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫోటో కారణంగా తీవ్ర చర్చలో నిలిచారు. 1990వ దశకంలో దుబాయ్‌లోని షార్జా స్టేడియంలో మందాకిని , దావూద్ ఇబ్రహీం కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫోటో ఒకటి బయటపడింది. ఈ ఫోటో పెద్ద దుమారం రేపింది. ఆ ఫోటోలో ఆమె నవ్వుతూ అతని పక్కన కూర్చుని ఉండటంతో దావూద్‌తో సంబంధం ఉందంటూ ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయని మందాకిని తెలిపారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ముప్పై ఏళ్ల క్రితం నాటి ఆ ఫోటో వెనుక అసలు కథ ఏంటో ఆమె వివరించారు.
మందాకిని మాట్లాడుతూ.. దావూద్ ఇబ్రహీంతో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను దావూద్ ఆహ్వానం మేరకు షార్జా క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లలేదని చెప్పారు. ఓ ప్రొఫెషనల్ షో కోసం దుబాయ్ వెళ్లిన సమయంలో ఆ క్రికెట్ మ్యాచ్‌కు హాజరయ్యానని తెలిపారు. అక్కడ చాలా మంది ఉన్నారని, వారిలో దావూద్ కూడా ఒకరని ఆమె వివరించారు. ఒక ఆర్టిస్ట్‌గా తనను ఎంతో మంది కలుస్తుంటారని, ప్రతి ఒక్కరినీ ఒకే విధంగా చూస్తామని మందాకిని చెప్పారు. తాను దావూద్‌తో ప్రత్యేకంగా వెళ్లి మ్యాచ్ చూడలేదని, ఆయన తనను ప్రత్యేకంగా ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. అక్కడి వెళ్ళాక అతను కనిపించడంతో మాట్లాడానని, ఒక ఫోటో ఆధారంగా తమకు అఫైర్ ఉందంటూ, తాము పెళ్లి చేసుకుని దుబాయ్‌లో నివసిస్తున్నామంటూ వచ్చిన వార్తలను ఆమె పూర్తిగా తోసిపుచ్చారు. ఈ రూమర్లు తన సినీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపాయని, సినీ అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయని మందాకిని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పటి పరిస్థితుల్లో ఇలాంటి వార్తలను ఎదుర్కోవడానికి తనకు సరైన పీఆర్ మేనేజ్‌మెంట్ కూడా లేదని ఆమె తెలిపారు. ఇప్పుడు ఉన్నట్టుగా సోషల్ మీడియా అప్పట్లో లేకపోవడంతో తప్పుడు ప్రచారాన్ని ఆపడం తనకు చాలా కష్టమైందని వివరించారు. ఒక ఫోటో ఆధారంగా తన వ్యక్తిగత జీవితంపై ఎన్నో కథనాలు ప్రచారంలోకి రావడం తన కెరీర్‌ను దెబ్బతీసిందని చెప్పారు. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మందాకిని ఈ సందర్భంగా వివరించారు. తాను 1990లో ముంబైకి చెందిన డాక్టర్ ఆర్. ఠాకూర్‌ను వివాహం చేసుకున్నానని, తనకు ఒక కుమారుడు ఉన్నాడని తెలిపారు. అండర్ వరల్డ్ ఫండింగ్ వంటి విషయాల గురించి తనకు అప్పట్లో ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంపై మాట్లాడటానికి ప్రధాన కారణం తన అభిమానుల మనసుల్లో తన గురించి ఎలాంటి తప్పుడు అభిప్రాయం ఉండకూడదనే ఉద్దేశమేనని మందాకిని పేర్కొన్నారు. దీంతో ఇన్నేళ్లుగా చర్చలో ఉన్న ఆ ఫోటో వివాదంపై మందాకిని స్పందన ఇప్పుడు బాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

