Son of Kanakadurgamma : భయంకరమైన నిధి అన్వేషణ.. అమ్మవారి ఉగ్రరూపంలో సీనియర్ హీరోయిన్ లయ

Kanakadurgamma

Kanakadurgamma

టాలీవుడ్ ప్రేక్షకులకు సీనియర్ హీరోయిన్ లయ సుపరిచితమే. ఒకప్పుడు తనదైన నటనతో కుటుంబ ప్రేక్షకులను మెప్పించిన ఆమె, ఇప్పుడు వెండితెరపై ఎవరూ ఊహించని విధంగా ఓ పవర్‌ఫుల్ అమ్మవారి అవతారంలో గూస్‌బంప్స్ తెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ‘నిధి అన్వేషణ’ (ట్రెజర్ హంట్) అనే అత్యంత ఆసక్తికరమైన కాన్సెప్ట్‌కు దైవ భక్తిని, యాక్షన్‌ను జోడిస్తూ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’. దసరా పండుగ కానుకగా ఈ చిత్రం నుంచి లయ అమ్మవారిగా ఉన్న ఓ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ సెన్సేషనల్ పోస్టర్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అశ్వనీదత్, స్వప్న దత్ చేతుల మీదుగా లాంచ్ చేయడం విశేషం. పోస్టర్ చూసిన అనంతరం చిత్రయూనిట్‌కు వారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాలో కేవలం యాక్షన్, అడ్వెంచర్ మాత్రమే కాకుండా లయ అమ్మవారిగా ఉగ్రరూపంలో కనిపించే సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఊహించని మలుపులు, గ్రాండ్ విజువల్స్, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.

అనురూప్ కటారి, లయ, ఆకాంక్ష త్యాగరాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని రాగ మూవీస్, తిలోత్తమ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వాణి శంకర్, తిలోత్తమ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దుర్గ ఫణిదర్ లంక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాకర్ల గోవర్ధనరావు కథను అందించారు. సామ్ కే ప్రసన్ పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, శశిధర్ లంక సంగీతం, ప్రసాద్ కేవీ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నాయి. రాజేష్ లంక యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌పై ఈ ఒక్క పోస్టర్‌తోనే అంచనాలు పెరిగాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను టీమ్ ప్రకటించనుంది.