Sonu Sood: ఐఫోన్ 18 సిరీస్ కోసం దేశవ్యాప్తంగా కనిపిస్తున్న క్రేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొత్త ఫోన్ కొనుగోలు చేసేందుకు స్టోర్ల ముందు భారీగా క్యూలు కనిపిస్తుండటంతో పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఐఫోన్ కొనడానికి గంటల తరబడి క్యూలో నిలబడిన వారిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్ చూస్తే నవ్వాలో, ఆలోచించాలో తెలియని పరిస్థితి. భారత్‌లో ఐఫోన్ 18 అమ్మకాలు ప్రారంభమైన వెంటనే ఆపిల్ స్టోర్ల ముందు సందడి కనిపించింది. కొత్త సిరీస్‌లో ఫోన్ కొనుగోలు చేసేందుకు అభిమానులు, టెక్ ప్రియులు పెద్ద సంఖ్యలో స్టోర్లకు చేరుకున్నారు. కొందరు తమకు నచ్చిన మోడల్‌ను సొంతం చేసుకునేందుకు ముందుగానే గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. ఈ దృశ్యాలను చూసిన సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా యూజర్స్ కి చురకలు అంటించారు.
ఓ ఐఫోన్ స్టోర్ బయట పొడవైన క్యూలో నిలబడిన ప్రజల ఫొటోను షేర్ చేసిన సోనూ సూద్, కొత్త ఫోన్ కొనడంపై మాత్రమే కాకుండా సమాజాన్ని మెరుగుపరచడంపైనా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొత్త ఫోన్, కొత్త ఈఎంఐలు వచ్చినా పాత బిల్లులు మాత్రం అలాగే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకోవడంతో పాటు సమాజంలో మార్పు తీసుకురావడానికి కూడా ఇలాంటి క్యూల్లో నిలబడాల్సిన అవసరం ఉందంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సోనూ సూద్ చేసిన ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. కొందరు ఆయన చెప్పిన విషయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు కొత్త ఫోన్ కొనడం అనేది వ్యక్తిగత నిర్ణయమని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఐఫోన్ 18పై ఉన్న క్రేజ్ మధ్య సోనూ సూద్ చేసిన ఈ పోస్ట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.
ఇక సోనూ సూద్ సినిమాల విషయానికి వస్తే, ఆయన చివరిసారిగా ‘ఫతే’ సినిమాలో కనిపించారు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా కూడా పరిచయం అయ్యారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో సోనూ సూద్ ప్రధాన పాత్రలో నటించారు. సినిమాలతో పాటు సోషల్ కార్యక్రమాలతోనూ సోనూ సూద్ తరచూ వార్తల్లో ఉంటారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో చేసిన సేవలతో ఆయనకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. రీసెంట్ గా నేపాల్ బాధితులను కూడా పరామర్శించి తన వంతు సహాయాన్ని అందించారు. తాజాగా ఐఫోన్ 18పై చేసిన ఈ కామెంట్‌తో మరోసారి ఆయన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.

