అశేష తెలుగు అభిమానులను శోక సంద్రంలో ముంచేస్తూ మరో తెలుగు దిగ్గజం సిరివెన్నెల నేలకొరిగిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో న్యుమోనియాకు చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల పార్థివదేహాన్నిమధ్యాహ్నం వరకు అక్కడ ఉంచి 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Read Also : సిరివెన్నెల పార్థీవదేహం వద్ద కన్నీరుమున్నీరైన తనికెళ్ళ
తాజాగా ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించిన సాయి కుమార్ మాట్లాడుతూ “సిరివెన్నెల సినిమా తోనే మా ఇద్దరి ప్రయాణం మొదలైంది. ఆ సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పాను. నా ప్రతీ అడుగులో నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. ఆయన ప్రతీ పాట ఆణిముత్యం. తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన వ్యక్తి సిరివెన్నెల.. ‘ఎవడు’ సినిమాలో సిరివెన్నెల కుమారుడు నటించాడు. అందులో నేను విలన్ పాత్ర చేసాను. ఆ సినిమా చూసి నీ విశ్వరూపం చూపావయ్యా సాయి అన్నారు’ అంటూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సాయి కుమార్.