Tarakaratna:నందమూరి నటవంశంలో హీరోలలో తారకరత్నది ఓ ప్రత్యేకమైన శైలి. తమ కుటుంబంలోని ఇతర కథానాయకుల స్థాయిలో సక్సెస్ దరి చేరక పోయినా పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నిస్తూనే వచ్చారు. ఆయన చిత్రసీమ ప్రవేశమే ఓ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ నాటికీ అదో రికార్డుగానే మిగిలింది. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఒకే రోజు తొమ్మిది చిత్రాల ప్రారంభోత్సవం చూశారు తారకరత్న. ఆ తొమ్మిది చిత్రాలలో తరువాత వెలుగు చూసినవి కొన్నే! అందులో విజయాలు చూసినవి లేవనే చెప్పాలి. అయినా విసుగు చెందలేదు, విశ్రమించలేదు. హీరో పాత్రలే వేస్తానని భీష్మించుకోలేదు. తన దరికి చేరిన ఏ పాత్రలోనైనా నటించడానికి సిద్ధం అంటూ సాగారు. ‘అమరావతి’ చిత్రంలో విలన్ గా నటించి, బెస్ట్ విలన్ గా నంది అవార్డుకు ఎన్నికయ్యారు తారకరత్న.
తారకరత్న 1983 ఫిబ్రవరి 22న జన్మించారు. యన్టీఆర్ నాలుగో కుమారుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహన్ కృష్ణ తనయుడే తారకరత్న. ఆయన తల్లి శాంతి – ప్రముఖ నిర్మాత, దర్శకుడు యు.విశ్వేశ్వరరావు కుమార్తె. అలా తారకరత్నకు తండ్రివైపు, తల్లివైపు ఇద్దరు తాతలు చిత్రసీమలో ప్రఖ్యాతిగాంచినవారు. యన్టీఆర్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన సంవత్సరంలోనే తారకరత్న జన్మించడం విశేషం! నందమూరి నటవంశం మూడోతరం హీరోగా జూనియర్ యన్టీఆర్ రాణిస్తున్న రోజుల్లోనే తారకరత్న సైతం చిత్రసీమపై మనసు పారేసుకున్నారు. అలా ఒకే రోజు తొమ్మిది చిత్రాల ఓపెనింగ్స్ లో నటించేసి తనకంటూ ఓ రికార్డును సొంతం చేసుకున్నారు తారకరత్న.
‘ఒకటో నంబర్ కుర్రోడు’తో తొలిసారి హీరోగా జనం ముందు నిలిచారు తారకరత్న. తరువాత “యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు, వెంకటాద్రి, నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని, మహాభక్త శిరియాళ, కాకతీయుడు” వంటి చిత్రాలలో కథానాయకునిగా నటించారు. ‘అమరావతి’లో ప్రతినాయక పాత్రలో మెప్పించారు. “మనమంతా, రాజా చెయ్యివేస్తే” చిత్రాలలో కీలక పాత్రల్లో కనిపించారు. ‘దేవినేని’లో దేవినేని నెహ్రూగా నటించి ఆకట్టుకున్నారు. చిత్రసీమను నమ్ముకుంటే ఏదో ఒక రోజు బ్రేక్ వస్తుందని ఎందరో అన్నారు. ఆ నమ్మకంతోనే తారకరత్న చిత్రసీమలో సాగారు. తారకరత్న నటించిన ‘సారథి’ జనం ముందు నిలచింది, కానీ వారి మనసులు గెలవలేకపోయింది. ఆ తరువాత వచ్చిన ‘ఎస్-5’ కూడా అంతగా అలరించలేదు.
సినిమాల విషయం వదిలేస్తే, తారకరత్నకు నందమూరి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. ఎందువల్లంటే, తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పలు మార్లు పాల్గొన్నారు. అనేక నియోజకవర్గాల్లో తారకరత్న ప్రచారం చేసిన సమయంలో పరిచయస్థులైన వారందరితోనూ ఆయన సన్నిహితంగా ఉండేవారు. తారకరత్న ప్రేమవివాహం చేసుకున్నారు. తద్వారా కన్నవారికి దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా, తారకరత్న తన బంధుమిత్రాదులందరితోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. తారకరత్న ఈ సారి తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ లోని ఏదో ఒక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని గత కొద్ది రోజులుగా విశేషంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ యాత్రను ప్రారంభిస్తున్నారని తెలిసి, ఆయనను కలుసుకున్నారు తారకరత్న. వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్న కారణంగా ఈ సారి తప్పకుండా తారకరత్న సైతం పోటీలో నిలుచుంటారని పార్టీ శ్రేణుల్లోనూ విశ్వాసం కుదిరింది. ఈ నేపథ్యంలోనే జనవరి 27న కుప్పం నుండి తన యాత్రను ప్రారంభించారు లోకేశ్. ఈ సమయంలో పలు విషయాలు దగ్గరుండి చూసుకున్న తారకరత్న ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. తారకరత్న బాబాయ్ బాలకృష్ణ దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. పరిస్థితి విషమించడంతో కుప్పం నుండి బెంగళూరు ‘నారాయణ హృదయాలయ’కు తరలించారు. అక్కడే కడవరకూ తారకరత్నకు చికిత్స సాగింది.
తారకరత్న తెలుగుదేశం పార్టీకి చెందినా, అతనికి అన్ని పార్టీల వారితోనూ సత్సంబంధాలు ఉండడం విశేషం! తారకరత్న ఆరోగ్యం విషయమై వైసీపీ శ్రేణులు సైతం ఆందోళన చెందాయి. నందమూరి అభిమానులు ఎప్పుడు ఎక్కడ కనిపించినా, తారకరత్న ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవారని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.