A Love Letter to Manjummel Boys: (స్పాయిలర్స్ ఉన్నాయి.. సినిమా చూడని వాళ్ళు స్కిప్ చేసి, చూశాక చదవండి)
ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలను తెలుగు ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. అయితే తెలుగు సినీ జర్నలిస్ట్ వర్గాల్లో ముందుగా మంజుమ్మల్ బాయ్స్ గురించి విని మామూలుగానే మలయాళ సినిమాలను కొంచెం హైప్ చేసి చెబుతారు కదా అంతేనేమో అనుకున్నా. రెండు మూడు రోజులు గడిచాక సోషల్ మీడియాలో కూడా సినిమా గురించి జరుగుతున్న చర్చలు చూసి ఇక ఆగలేక మలయాళ వెర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ షోలో ఒక టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయా. నిజానికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అనేవి లేకున్నా మలయాళ వెర్షన్ చూసినా అర్ధం అయ్యేలా ఉంది సినిమా. సినిమా చూడక ముందే చేసిన రీసెర్చ్ ప్రకారం తెలిసిన విషయం ఏమంటే ఈ సినిమా మొత్తం 2006లో జరిగిన ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారని. దీంతో సినిమా మీద మరింత ఆసక్తి పెరిగింది.
నాలో ఏర్పడిన అంచనాలను సినిమా ఒక్క విషయంలో కూడా వమ్ము చేయలేదు. కేరళ రాష్ట్రం కొచ్చిలోని మంజుమ్మల్ అనే ప్రాంతానికి చెందిన 11 మంది కుర్రాళ్ళు. తమ ఆపోజిట్ వర్గంలోని కుర్రాళ్ళు మున్నార్ అనే ప్రాంతానికి ట్రిప్ వెళ్లారని తెలిసి గోవా వెళ్లాలని సిద్ధం అవుతారు. తెలిసిందే కదా కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకునే కుర్రాళ్లు అయితే మరి కొంతమంది ఆవారాగా గాళ్లు. గోవా కోసం డబ్బులు సెట్ అవ్వకపోవడంతో దగ్గర్లోనే ఉన్న కొడైకెనాల్ అనే హిల్ స్టేషన్ వెళ్లడానికి సిద్ధమవుతారు. ముందుగానే మాట్లాడుకున్న స్నేహితుడి క్వాలిస్ వాహనంలో అందరూ సిద్ధమై కొడైకెనాల్ వెళ్లి ఎంజాయ్ చేస్తారు. సాధారణంగా ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎలా ఉంటున్నారో అలాగే తాగుతూ తందనాలు ఆడుతూ పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతూ తమ వయసుకు వచ్చిన అహాన్ని చూపిస్తూ సరదాగానే నడిపిస్తూ ఉంటారు. ఇక కొడైకెనాల్లో చూడాల్సింది అంతా అయిపోయింది ఇంటికి బయలుదేరి వెళదాం అనుకుంటున్నా సమయంలో కారులో పాటలు పెట్టే సమయంలో గుణ కేవ్స్ చూడడం మిస్ అయ్యామని తెలుసుకుంటారు. ఇంకేముంది గుణా కేవ్స్ చూసి ఇంటికి వెళ్లాలని అక్కడికి వెళ్తారు. అక్కడ కూడా తమదైన టీనేజ్ మెంటాలిటీతో రిస్ట్రిక్టేడ్ ఏరియాలోకి వెళ్ళకూడదు అని తెలిసి కూడా వెళ్లి చిక్కుల్లో పడతారు. వారిలో ఒకడైన సుభాష్ అనే వ్యక్తి లోతుగా ఉన్న గుంతలో పడిపోతాడు. అప్పటివరకు సాదాసీదాగా సరదా సరదాగా కుర్రాళ్ళ అల్లరిని చూపిస్తూ వెళ్లిన వైనం ఒక్కసారిగా షాక్ ఇచ్చేస్తుంది.
నిజానికి అధికారిక లెక్కల ప్రకారం గుణ కేవ్స్ లో ఉన్న గోతుల్లో పడిన సుమారు 13 మందిని కనీసం శవాలను కూడా వెలికి తీయలేకపోయారు ఒక బ్రిటిష్ అధికారి డెవిల్స్ కిచెన్ గా నామకరణం చేసిన ఈ ప్రాంతంలో పడిన వారెవరు బయటకి రారు అని అక్కడి స్థానికులు నమ్మకం అలాంటి ఒక గోతిలో పడిన తమ స్నేహితుడిని రక్షించుకునేందుకు మిగతా పదిమంది స్నేహితులు పడిన బాధను సినిమాగా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నిజానికి సినిమాగా చూస్తే సినిమా కోసం వాడిన టెక్నాలజీలు సాంకేతిక అంశాలు ప్రతి ఒక్కటి ది బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే గోతిలో పడిన సుభాష్ బయట ఉన్న అతని స్నేహితుల చిన్నప్పటి అంశాలతో సినిమాని లింక్ చేసిన విధానం కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
సుశిక్షితులైన అగ్నిమాపక సిబ్బంది అటవీ సిబ్బంది పోలీసు సిబ్బంది కూడా గోతిలోకి దిగడానికి భయపడిన సమయంలో చిన్నప్పటినుంచి తమతో పెరిగిన స్నేహితుడు కళ్ళ ముందు లేకపోయినా అసలు ఎలా అయినా తీసుకువెళ్లాలని ఆ పదిమంది పడిన తాపత్రయం వర్ణనాతీతం దాన్ని సినిమా చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అయితే సినిమా కథతో గుణ సినిమాలోని కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే అనే పాటను లింక్ చేసిన విధానం అయితే కళ్ళ వెంట నీళ్లు రప్పిస్తుంది.
కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే…ఊహలన్ని పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో అంటూ సాగుతూ ఉన్న సాంగ్ కేవలం గుణ కేవ్స్ నేపథ్యంలో సినిమా షూట్ చేసినందుకే వాడారని కొందరు అనుకునే అవకాశం ఉంది. కానీ గుణ సినిమాలో కమల్ కు తన ప్రేయసి మీద ఉన్న ప్రేమ ఎలా అయితే స్వచ్ఛమైనదో ఇక్కడ లోపల పడిన వ్యక్తి మీద అతని స్నేహితులకు ఉన్న ప్రేమ కూడా అలా స్వచ్చమైనదే.
గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే, మాయ చేసే ఆ మాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు అంటూ సాగే లిరిక్స్ కూడా స్నేహితులు అండగా ఉంటే వాళ్ళ మధ్య ఎన్ని పొరపొచ్చాలు వచ్చినా ఎన్ని గాయాలు ఒంటికి తగిలినా వారిచ్చే ధైర్యం అనంతం అంటూ చూపించిన విధానం చూసి ఫిదా అవని వారు ఎవరు?
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది, మనుషులెరుగలేరు, మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది అంటూ చివరికి తమ స్నేహితుడిని రక్షించుకున్నాక పాట చూసి అదిరిపోయి చప్పట్లు కొడుతూ, కన్నీళ్లు పెట్టని వారు ఎవరు?
మనుషులెరుగలేరు, మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది అంటే అది కేవలం స్త్రీ-పురుషుల మధ్య ప్రేమ కాదు. స్నేహితుల మధ్య ప్రేమ కూడా అవచ్చు అని ఈ సినిమాతో ప్రూవ్ చేశారు. అక్కడి స్థానికులు, పోలీసులు, ఫైర్, అగ్నిమాపక సిబ్బంది అతను చనిపోయి ఉంటాడు, ఏమి చేసినా ఉపయోగం లేదని చెప్పినా వినకుండా అతని కోసం పడిన తాపత్రయమే కదా మనుషులెరుగని అగ్ని కంటే స్వచ్ఛమైన ప్రేమ. లోపల పడ్డ వ్యక్తి కొంచెం కొంచెంగా పైకి వస్తున్న సమయంలో థియేటర్లో సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు తెలియకుండానే అప్పటి వరకు పడిన బాధను మరుస్తూ రిలీఫ్ పొందడం కదా నిజమైన రియలిస్టిక్ అనుభూతి.
ఈ సినిమాను లైన్ గా అనుకుని ఈ స్థాయిలో డైరెక్ట్ చేసిన చిదంబరం, సినిమాలో నటిస్తూనే సినిమాను సోదరుడితో కలిసి నిర్మించిన షౌబిన్ షబీర్ తో పాటు సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఇది కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు జీవితాంతం గుర్తుండిపోయే ఒక గోల్డెన్ పేజ్. ఇంత అద్భుతమైన సినిమాను మనకి అంటే తెలుగు ఆడియన్స్ కి అందించిన మైత్రీ మూవీ మేకర్స్ కి కూడా ఇది ఒక మరపురాని సినిమా అవుతుంది. ఇలాంటి టెక్నీకల్ బ్రిలియన్స్, ఎమోషనల్ డ్రైవెన్, గ్రిప్పింగ్ సర్వైవల్ థ్రిల్లర్ మనకు అందించిన వారికి
ప్రేమతో
భార్గవ్ చాగంటి