A. KodandaRamireddy: టాప్ స్టార్స్ తో భలేగా సాగిన కోదండరామిరెడ్డి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో నవలా చిత్రాలకు పలు కమర్షియల్ హంగులు అద్ది విజయం సాధించిన దర్శకుల్లో ఏ.కోదండరామిరెడ్డి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇక యాక్షన్ మూవీస్ ను తెరకెక్కించడంలోనూ, కామెడీతో కదం తొక్కడంలోనూ కోదండరామిరెడ్డి తనదైన మార్కు ప్రదర్శించారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ విజయకేతనం ఎగురవేసిన కోదండరామిరెడ్డి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆ రోజుల్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది.
ఏ.కోదండరామిరెడ్డి 1950 జూలై 1న నెల్లూరు జిల్లా మైపాడులో జన్మించారు. ఇందుకూరు పేట, నరసాపురంలో కోదండరామిరెడ్డి విద్యాభ్యాసం సాగింది. చదువుకొనే రోజుల్లోనే సినిమాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. కొందరు ఈయనను ‘శోభన్ బాబులా ఉన్నావ్’ అంటూ ఉండేవారు. ఎస్.ఎస్.ఎల్.సి., చదివాక పి.యు.సి.లో కాలుమోపారు. ఎలాగైనా సినిమాల్లో నటించాలనే ఆసక్తితో మద్రాసు పరుగులు తీశారు. అక్కడకు వెళ్ళాక నటన అంత తేలిక కాదు అన్న విషయం తెలిసింది. సమీప బంధువు ప్రభాకర్ రెడ్డి ద్వారా దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆయన సహకారంతో వి.మధుసూదనరావు వద్ద అసిస్టెంట్ గా చేరారు కోదండరామిరెడ్డి. మధుసూదనరావు తెరకెక్కించిన ‘మనుషులు మారాలి’ చిత్రానికి కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి ఇద్దరూ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశారు. ఆ అనుబంధంతో రాఘవేంద్రరావు తెరకెక్కించిన కొన్ని చిత్రాలకు కో-డైరెక్టర్ గా పనిచేశారు కోదండరామిరెడ్డి. హిందీ చిత్రం ‘తపస్య’ ఆధారంగా రూపొందిన ‘సంధ్య’ చిత్రంతో కోదండరామిరెడ్డి దర్శకునిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా అంతగా అలరించక పోయినా, దర్శకునిగా కోదండరామిరెడ్డికి మంచి పేరు తెచ్చింది. దాంతో క్రాంతికుమార్ డి.కామేశ్వరి రాసిన ‘కొత్త మలుపు’ నవలను సినిమాగా మలుస్తూ కోదండరామిరెడ్డిని దర్శకునిగా ఎంచుకున్నారు. ఆ సినిమాయే ‘న్యాయం కావాలి’. అందులో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోగా కనిపించారు. ఆ సినిమాతోనే చిరంజీవి, కోదండ అనుబంధం ఏర్పడింది. ‘న్యాయం కావాలి’ ఘనవిజయం తరువాత కోదండరామిరెడ్డి మరి వెనుతిరిగి చూసుకోలేదు.
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
చిరంజీవిని స్టార్ హీరోగా నిలపడంలో కోదండరామిరెడ్డి పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. వారిద్దరి కాంబోలో రూపొందిన “కిరాయి రౌడీలు, శివుడు శివుడు శివుడు, ఖైదీ, గూండా, దొంగ” వంటి చిత్రాలు చిరంజీవికి ఎనలేని మాస్ ఇమేజ్ ను సంపాదించి పెట్టాయి. ఇక చిరంజీవితో కోదండ తెరకెక్కించిన “అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, రక్తసిందూరం, గూండా” వంటి నవలా చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ఆ పై చిరంజీవితో కోదండ రూపొందించిన “విజేత, పసివాడి ప్రాణం, దొంగమొగుడు, అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ” వంటి చిత్రాలు సైతం జయకేతనం ఎగురవేశాయి. ఆ రోజుల్లో చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో ఓ చిత్రం వస్తోందంటే జనం ఎనలేని ఆసక్తితో ఎదురుచూసేవారు. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ ఫలితాలూ ఉండేవి. చిరంజీవితో ఎక్కువ చిత్రాలు రూపొందించిన దర్శకునిగా ఆయన నిలిచారు.
బాలకృష్ణతో ఎక్కువ చిత్రాలు తెరకెక్కించిన దర్శకునిగానూ కోదండరామిరెడ్డి నిలవడం విశేషం! వీరి కాంబోలో వచ్చిన “భార్గవరాముడు, అనసూయమ్మగారి అల్లుడు, రక్తాభిషేకం, భలేదొంగ, నారీ నారీ నడుమ మురారి, బొబ్బిలి సింహం” వంటి చిత్రాలు విజయవిహారం చేశాయి. మాస్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ఉన్న బాలకృష్ణతో ఒక్క ఫైట్ కూడా లేకుండా ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి హాస్యరస ప్రధాన చిత్రాన్ని కోదండరామిరెడ్డి వంటి కమర్షియల్ డైరెక్టర్ రూపొందించడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. నాగార్జునతో కోదండ తెరకెక్కించిన “ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, విక్కీదాదా, అల్లరి అల్లుడు” చిత్రాలు మురిపించాయి. వెంకటేశ్ తో కోదండ రూపొందించిన ‘సూర్య ఐపీఎస్’ అలరించింది. దాదాపు ఎనభై చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. కోదండ దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘పున్నామినాగు’. తరువాత తనయుడు వైభవ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘కాస్కో’ చిత్రం నిర్మించారు. ఆ తరువాత నుంచీ కోదండరామిరెడ్డి సినిమాలకు దూరంగానే ఉన్నారు. అయినా, ఆయన ఒకప్పుడు తెరకెక్కించిన చిత్రాలు నవతరం ప్రేక్షకులను సైతం బుల్లితెరపై ఆకట్టుకుంటూ ఉండడం విశేషం!
తాజావార్తలు
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!