NTV Telugu Site icon

Tanikella Bharani: బాల్య జ్ఞాపకాలతో రైల్వే క్వార్టర్స్ నేపథ్యంలో సినిమా!

Bharani Final

Bharani Final

Bharani: ప్రముఖ నటుడు, దర్శక రచయిత తనికెళ్ళ భరణి బాల్యం, యవ్వన కాలం చిలకలగూడాలోని రైల్వే క్వార్టర్స్ లో గడిచింది. ‘రైల్వే క్వార్డర్స్ అంటే మినీ ఇండియా అని, అప్పట్లో తమ ఇంటి చుట్టూ అన్ని కులాల, అన్ని మతాల, ప్రాంతాల వాళ్ళు ఉండేవారని, యుక్తవయసు వచ్చే వరకూ కులాల పేరుతో జనాలకు కొట్టుకుంటారనే విషయమే తనకు తెలియద’ని తనికెళ్ళ భరణి చెప్పారు. శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే లలిత కళా సమితి తనికెళ్ళ భరణికి ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేసి, ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘రైల్వే క్వార్టర్స్ తో తనకున్న అనుబంధాన్ని ‘చిలకలగూడ, రైల్వే క్వార్టర్స్ 221/1′ పేరుతో సినిమాగా తీయాలన్నది తన కోరిక’ అని చెప్పారు.

రైల్వే డిపార్ట్ మెంట్ లో పనిచేసిన తన తండ్రిని, సోదరుడిని తలుచుకున్నారు. తన తండ్రి రైల్వే ఉద్యోగి కావడం వల్లే తాను మూడుసార్లు దేశవ్యాప్తంగా పర్యటించగలిగానని, విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ రైలులో ప్రయాణం చేయడానికి ప్రాధాన్యమిస్తాన’ని అన్నారు. తాను రాసిన పలు నాటకాల తొలి ప్రదర్శన బోయిగూడాలోని రైల్ కళారంగ్ ఆడిటోరియంలో జరిగాయని, ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తన కళ్ళ ముందే రైల్ నిలయం నిర్మాణం జరిగిందని, ఈ వేదిక మీద కూడా పలు ప్రదర్శనలు ఇచ్చానని అన్నారు. ‘ఇంతవరకూ ఎన్నో సత్కారాలు పొందినా, జ్ఞాపికలను అందుకున్నా… ఈ రోజున లలిత కళాసమితి ఇచ్చిన 1854 నాటి మొట్ట మొదటి రైల్వే ఇంజిన్ మోడల్, ఫేరీ క్వీన్ జ్ఞానపీఠ పురస్కారం లాంటిద’ని హర్షధ్వానాల మధ్య తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ప్రముఖ నాటక, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ ‘ఇది రైల్ నిలయం కాదని, కళా నిలయమ’ని అభివర్ణించారు. తాను గురుతుల్యులుగా భావించే భరణి గారు గొప్ప రచయిత, నటుడు, దర్శకుడు మాత్రమే కాదని… మానవీయ విలువలు ఉన్న గొప్ప వ్యక్తి అని కితాబిచ్చారు. బుర్రా సాయిమాధవ్ మాటలు సమకూర్చిన ‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీలోని గీతానికి ఆస్కార్ పురస్కారం లభించిన నేపథ్యంలో ఆహుతులంతా నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. ‘ఐదు దశాబ్దాలకు పైగా లలిత కళా సమితి ఎన్నో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను నిర్వహించిందని, కళాకారులను సత్కరించిందని, నవతరం నడుం బిగించి, సమితి కార్యకార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంద’ని ఉపాధ్యక్షులు రవి పి పాడి చెప్పారు.

సన్మాన గ్రహీత తనికెళ్ళ భరణి, ఆత్మీయ అతిథి బుర్రా సాయి మాధవ్ తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులకు ఘంటసాల, బాలు జీవిత చరిత్ర పుస్తకాలను రవి పాడి బహూకరించారు. లలిత కళా సమితి అధ్యక్షురాలు కె. పద్మజ, భుజంగరావు, శ్రీకంఠ హన్మంతరావు, రాజు, జగదీశ్, ఎస్.కె. చాంద్ పాషా, ‘రంగమార్తాండ’ మాటల రచయిత ఆకెళ్ళ శివప్రసాద్, బుర్రా నరసింహ, వేణు వాత్యం, ప్రవర సాయి, రెంటాల రామచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనికెళ్ళ భరణి సన్మాన కార్యక్రమానికి ముందు వినోద్ బాబు బృందం సంగీత విభావరి జరిగింది.

Read Also:Aishwarya Rajinikanth: ఐశ్వర్య పిసినారి.. జీతం పెంచలేదు.. అందుకే దొంగతనం