Tollywood: గత వారం విడుదలైన ఏడు చిత్రాలలో సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’ నిరాశ పర్చగా, సుహాస్ నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ‘రైటర్ పద్మభూషణ్’ డీసెంట్ హిట్ ను అందుకుంది. మిగిలిన సినిమాల గురించి ఎవరూ మాట్లాడుకోవడమే లేదు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి సెకండ్ వీకెండ్ లో మరిన్ని చిన్న సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ వారం వస్తున్న సినిమాలలో ఒకటి కన్నడ అనువాద చిత్రం కాగా, మిగిలిన ఏడు స్ట్రయిట్ తెలుగు సినిమాలు. ఇందులో శివ రాజ్ కుమార్ నటించిన 125 కన్నడ సినిమా ‘వేద’ గురువారమే థియేటర్లలో విడుదల అవుతోంది.
ఈ వారం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘అమిగోస్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయడం విశేషం. యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రూపుదిద్దుకున్న ‘అమిగోస్’లో బాలకృష్ణ చిత్రంలోని ‘ఎన్నో రాత్రులొస్తాయి కానీ…. ‘ రీమిక్స్ సాంగ్ ను పెట్టడంతో నందమూరి అభిమానులలో సరికొత్త జోష్ నెలకొంది. పైగా ఈ యేడాది ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకోవడం, కళ్యాణ్ రామ్ గత చిత్రం ‘బింబిసార’ హిట్ కావడంతో ఈ మూవీ ఓపెనింగ్స్ కు ఢోకా లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
ఇదే శుక్రవారం అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటించిన ‘పాప్ కార్న్’ మూవీ రిలీజ్ అవుతోంది. దీనికి అవికా గోర్ కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. అలానే రవీంద్ర గోపాల తీసిన ‘దేశం కోసం భగత్ సింగ్’; గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన రొమాంటిక్ పొలిటికల్ డ్రామా ‘సిరిమల్లెపువ్వా’; యాక్షన్ థ్రిల్లర్ ‘చెడ్డీగ్యాంగ్ తమాషా’; యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘అల్లంతదూరాన…’; క్రికెట్ అండ్ బెట్టింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ‘ఐపిఎల్’ మూవీస్ రాబోతున్నాయి. వీటితో పాటే జాతీయ నటుడు బాబీ సింహా నటించిన పాన్ ఇండియా మూవీ ‘వసంత కోకిల’ కూడా తెలుగులో శుక్రవారం రిలీజ్ అవుతోంది. దీన్ని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తీశారు. కశ్మీర పర్దేశీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని రమణన్ పురుషోత్తమ దర్శకత్వంలో రజనీ తాళ్లూరి, రేష్మీ సింహా సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ తొమ్మిది సినిమాలలో ఏవేవి విజయం సాధిస్తాయో చూడాలి.
