BalaRaju: మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటజీవితంలో మరపురాని చిత్రాలలో ‘బాలరాజు’ స్థానం ప్రత్యేకమైనది. 1948 ఫిబ్రవరి 28న విడుదలైన ‘బాలరాజు’ అక్కినేని అభిమానులకూ ఈ నాటికీ గుర్తుండి పోయే చిత్రమే! ఏయన్నార్ ను స్టార్ గా నిలిపిన చిత్రమిది. ఆయనను చిత్ర పరిశ్రమకు ‘సీతారామజననం’తో పరిచయం చేసిన ఘంటసాల బలరామయ్య తమ ప్రతిభా ప్రొడక్షన్స్ పతాకంపై ఈ ‘బాలరాజు’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఎస్.వరలక్ష్మి నాయికగా నటించిన ‘బాలరాజు’ ఆ రోజుల్లో విజయకేతనం ఎగురవేసింది. అప్పట్లో దాదాపు 35 వారాలు (ఫిష్ట్ పై) ప్రదర్శితమై విశేషాదరణ చూరగొంది. ‘బాలరాజు’కు ఊరూరా జనం నీరాజనాలు పట్టారు. అనేక కేంద్రాలలో ఈ చిత్రం శతదినోత్సవం చూసింది. అంతకు ముందు కొన్ని చిత్రాలలో ఏయన్నార్ కథానాయకునిగా సాగినా, ఆయనకు పూర్తి స్థాయి హీరోగా మంచి మార్కులు సంపాదించి పెట్టింది ‘బాలరాజు’. ఎక్కడికి వెళ్ళినా అప్పట్లో ఏయన్నార్ ను ‘బాలరాజు’ అనే పిలిచేవారు.
‘బాలరాజు’ కథ విషయానికి వస్తే – ఈ కథను మన పుక్కిటి పురాణాల నుండి తీసుకు వచ్చి రూపొందించారు. అందునా భారతదేశానికి స్వరాజ్యం సిద్ధించిన తొలి రోజులు కావున, భారతీయుల మనోభావాలనూ ఇందులో సంభాషణల్లోనూ, పాటల్లోనూ అనువుగా చొప్పించారు అనిపిస్తుంది. కథ స్వర్గంలో మొదలవుతుంది. దేవకన్య మోహిని, ఓ యక్షుడు ప్రేమించుకుంటారు. స్వర్గలోకాధినేత అయిన ఇంద్రునికి మోహినిపై మనసు ఉంటుంది. దాంతో యక్షులు, దేవతలు అన్న భేదం చూపించి, యక్షునికి శాపమిప్పిస్తాడు. తరువాత మోహినికీ భూలోకంలో జన్మించి, ప్రియుని కోసం తపించమని శాపమిస్తారు. భూలోకంలో యక్షుడు బాలరాజు అనే గోపాలునిగానూ, మోహిని సీత పేరుతో కమ్మనాయుడు ఇంట జన్మిస్తారు. పెరిగిపెద్దవుతారు. యువకుడైన బాలరాజు పిల్లనగ్రోవి విని, నవయవ్వనంలో ఉన్న సీత ఆకర్షితురాలవుతుంది. అలా బాలరాజుకు, సీత పరిచయం అవుతుంది. బాలరాజును చూడగానే సీత అతనే తనకు తగినవాడని భావిస్తుంది. ఆమెకు గత జన్మతాలూకు జ్ఞాపకాలతో తన ప్రియుని గుర్తిస్తుంది. అయితే శాపవశాన బాలరాజు ఆమెను గుర్తించలేడు. అతని వెంట పడి తనను పెళ్ళాడమని వేడుకుంటుంది. ఆ తరువాత నుంచీ బాలరాజుకు ఇంద్రుడు పలు సమస్యలు సృష్టిస్తూ వస్తాడు. ఓ మునిశాపన బాలరాజు పాముగా మారతాడు. సీత తన ప్రేమశక్తితో అతనికి మళ్ళీ మానవరూపం తెప్పిస్తుంది. అప్పుడు బాలరాజుకు కూడా గతం గుర్తుకు వస్తుంది. ఈ జన్మలోనైనా సీతను తనదానిగాచేసుకోవాలన్నదే ఇంద్రుని పన్నాగం. మొత్తానికి బాలరాజు, సీత పెళ్ళాడతారు. వారిద్దరూ ఏకం కాకమునుపే బాలరాజు ప్రాణం పోయేలా చేస్తాడు ఇంద్రుడు. దాంతో సీత తన పతిభక్తితో శాపం పెడుతుంది. శచీదేవి వచ్చి వేడుకున్నా, నీ భర్త నీచుడని, అతనికి శాపమివ్వక తప్పదని అంటుంది సీత. మహాశివుడు వచ్చి ఆమెను ప్రసన్నురాలిని చేస్తాడు. ఇంద్రుని అందరు దేవతలు తప్పు పడతారు. బాలరాజుకు దేవతలు ప్రాణం పోస్తారు. మళ్ళీ స్వర్గానికి రమ్మని వారిద్దరికీ చెబుతాడు ఇంద్రుడు. అయితే స్వాతంత్ర్యం, మార్పు లేని స్వర్గం కంటే భూలోకమే మనోహరంగా ఉందని సీత తిరస్కరిస్తుంది. అందరూ ఆ దంపతులను దీవించడంతో కథ ముగుస్తుంది.
బాలరాజుగా నాగేశ్వరరావు, ఇంద్రునిగా డి.సదాశివరావు, యలమందగా కస్తూరి శివరావు, కమ్మనాయుడుగా జి.రామయ్య, రాముడుగా బి.సీతారామ్, సెట్టిగా జి.సుబ్బారావు, గంధర్వునిగా ఎ.ఎల్.నారాయణ, అగ్నిగా ఎస్.క్రిష్ణయ్య, మోహినిగా అంజలీదేవి, సీతగా ఎస్.వరలక్ష్మి, లక్ష్మిగా నారీమణి, లక్ష్మమ్మగా సి.రాజరత్నం నటించారు.
ఈ చిత్రానికి రచన, పాటలు సముద్రాల రాఘవాచార్య సమకూర్చారు. పి.శ్రీధర్ ఫోటోగ్రఫి నిర్వహించారు. గాలిపెంచల నరసింహారావు, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం రూపొందించారు. సి.ఆర్.సుబ్బురామన్ నేపథ్య సంగీతం అందించారు. నృత్యాలను వేదాంతం రాఘవయ్య రూపొందించారు. ఇందులోని “నవోదయం…శుభోదయం…”, “ఓ బాలరాజా ప్రేమ ఎరుగవా…”, “ఎవరినే నేనెవరినే…”, “ఓ బాలరాజా…జాలి లేదా…”, ” “చెలియా కనరావా…”, “నీకూ నీవారు లేరు…”, “దేవుడయా దేవుడు…”, “చూడచక్కని చిన్నది…”, “రాజా నా రాజా…”, “వేరే లేరయా పరమేశా…”, “వరుణా వరుణా…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఇందులో అన్నీ కలిపి మొత్తం 19 పాటలున్నాయి.
ఆ రోజుల్లో ‘బాలరాజు’ పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. “నవోదయం…శుభోదయం… నవయువ శోభా మహోదయం…” అంటూ సాగే పాటతోనే సినిమా మొదలవుతుంది. ఇది జానపద చిత్రమే అయినా, ఇందులోనూ విప్లవ భావాలు, నవయుగ శోభను సముద్రాలవారు చొప్పించడం ఆయన దేశభక్తికి నిదర్శనమని చెప్పక తప్పదు. ఈ సినిమా విడుదల నాటికి మన దేశానికి స్వాత్రంత్యం సమకూరి సంవత్సరం కాలేదు. అందువల్ల ఈ పాటలో వినిపించే “స్వతంత్ర జీవన ప్రభాతగీతం…”, “ఆడునదిగో అరుణ పతాకం…” వంటి పదబంధాలు విజయగర్వంతో ఉన్న మనవారి మనసులు తాకాయి. అలాగే విప్లవ భావాలు ఉన్న నాటి యువతనూ ఆకట్టుకున్నాయి. అలా సముద్రాల వారు నాటి నవభారతానికి నివాళి అర్పించారు. ఏయన్నార్ కెరీర్ లో తొలి ఘనవిజయంగా ‘బాలరాజు’ నిలచింది. 1970ల దాకా ‘బాలరాజు’ రిపీట్ రన్స్ చూసింది. ‘బాలరాజు’ ఘనవిజయంతో ఆ పేరుతో ఏయన్నార్ పై కొన్ని చిత్రాలలో పాటలూ రూపొందాయి.
‘బాలరాజు’ శతదినోత్సవాలు… వివాదం!
1978 తరువాత ‘బాలరాజు’ సినిమా ఆ రోజుల్లోనే 69 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్నట్టు ఓ ప్రకటన పేపర్ లో వెలుగు చూసింది. అంతకు ముందు ఏ నాడూ ఈ సినిమా ఇన్ని కేంద్రాలలో శతదినోత్సవం చూసినట్టుగా ఎవరూ ప్రచారం చేయలేదు, ప్రకటించలేదు. పైగా ఈ సినిమాను ‘స్వర్ణోత్సవం’ (గోల్డెన్ జూబ్లీ – 365 రోజులు) ఆడినట్టూ కొందరు ప్రకటించారు. దానితో ఏయన్నార్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ ప్రచారాన్ని యన్టీఆర్ అభిమానులు తిప్పి కొడుతూ కరపత్రాలు వేసుకొని మరీ యుద్ధం సాగించారు. తమ ‘లవకుశ’ 62 కేంద్రాలలో శతదినోత్సవం, 18 కేంద్రాలలో రజతోత్సవం, హైదరాబాద్ లో వజ్రోత్సవం (60 వారాలు) ఆడినట్టు నిరూపిస్తామని, మీ ‘బాలరాజు’ కనీసం 12 కేంద్రాలలో శతదినోత్సవం చూసినట్టుగానీ, స్వర్ణోత్సవం జరుపుకున్నట్టుగానీ నిరూపించమని సవాల్ చేశారు.
వివాదానికి ముగింపు..
కానీ, ఏయన్నార్ అభిమానుల్లో కొందరు ‘బాలరాజు’ 69 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుందనీ, గోల్డెన్ జూబ్లీ చూసిందనే వాదించేవారు. అయితే, 1975లో ఏయన్నార్ తమ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ప్రారంభోత్సవానికి ఓ ప్రత్యేక బులిటెన్ ను విడుదల చేశారు. అందులో ఆయన సైతం ‘బాలరాజు’ను స్వర్ణోత్సవ చిత్రంగా పేర్కొనలేదు. పైగా ఏయన్నార్ తొలి గోల్డెన్ జూబ్లీగా ‘దసరాబుల్లోడు’ అనే ప్రకటించారు. అదే బులిటెన్ ను బయటకు తీసి, యన్టీఆర్ అభిమానులు అసలైన రుజువు ఇదేనని చాటారు. ఆ తరువాత ఓ సందర్భంలో అక్కినేని స్వయంగా తనకు లేని రికార్డులు తనవని చెప్పుకొనే దుస్థితి తనకు పట్టలేదని తమ బులిటెన్ లో ప్రకటించినవే అసలైన విజయాలనీ చెప్పారు. దాంతో ‘బాలరాజు’ సెంటర్స్ పై వివాదం ముగిసింది.