NTV Telugu Site icon

Manchi Manasulu: అరవై ఏళ్ళ ‘మంచి మనసులు’

Manchi Manasulu

Manchi Manasulu

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటజీవితంలో మరపురాని చిత్రాలెన్నో! వాటిలో 1962 ఏప్రిల్ 11న విడుదలైన ‘మంచి మనసులు’ మరపురానిది. అంతకు ముందు తమ అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై నిర్మితమైన చిత్రాలలో అక్కినేని, ఆదుర్తి సుబ్బారావు కాంబినేషన్ విజయ దుందుభి మోగించింది. ఆ తరువాత ‘బాబూ మూవీస్’లోనూ ఏయన్నార్, ఆదుర్తి విజయఢంకా మోగించడానికి నాంది పలికిన చిత్రం ‘మంచిమనసులు’. సావిత్రి, కృష్ణకుమారి నాయికలు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ‘మంచి మనసులు’ చిత్రంతోనే కేవీ మహదేవన్ తెలుగువారి మదిలో ‘మామ’గా చోటు సంపాదించారు.

ఈ చిత్ర కథ ఏమిటంటే- కమ్మరి రంగయ్య కష్టపడి తమ్ముడు వేణును చదివిస్తూ ఉంటాడు. అన్నకు భారం కాకూడదని ప్లీడర్ ఆనందరావు ఇంట్లో ఓ గదిలో ఉంటాడు వేణు. ఆనందరావు కూతురు శాంతి, వేణును ప్రేమిస్తుంది. ఆనందరావు కూడా సంతోషంగా వారి పెళ్ళికి అంగీకరిస్తాడు. అయితే రంగయ్య కన్ను మూయడంతో ఆయన కూతురు జయ బాధ్యత వేణు తీసుకుంటాడు. జయ, కుమార్ అనేవాడిని ప్రేమిస్తుంది. వాడు ఆమెను లొంగదీసుకుంటాడు. ఈ విషయం తెలిసి వేణు మందలిస్తాడు. కుమార్ నే పెళ్ళాడతానంటుంది జయ. అందుకు కుమార్ కన్నవారు తమ గుడ్డి కూతురు రాధను వేణు పెళ్ళాడితేనే జయ వివాహం జరుగుతుందనే నిబంధన పెడతారు. శాంతికి ఈ విషయం తెలిసి, వేణును జయ కోసం రాధనే పెళ్ళాడమంటుంది. జయ పెళ్ళి కోసం కుమార్ చెల్లెలు రాధను వేణు పెళ్ళాడుతాడు. శాంతిని మరచిపోలేని వేణు భార్యకు దగ్గర కాలేడు. ఆ విషయం తెలిసి, శాంతి , భార్యను అనురాగంతో చూసుకోమంటుంది. భార్యను తీసుకొని వేణు హంపికి వెళతాడు. కుమార్ కు పెళ్ళికి ముందే మరో అమ్మాయితో సంబంధం ఉంటుంది. కుమార్ కు పెళ్ళయిన సంగతి తెలిసి ఆమె నిలదీస్తుంది. ఆమె పీడ వదిలించుకోవడానికి కుమార్, ఆమెను హంపికి తీసుకువెళ్ళి చంపేస్తాడు. ఆమెను చంపి పారిపోతున్న కుమార్, తన చెల్లెలి చేయినే చూసుకోకుండా తొక్కుతాడు. కుమార్ చేసిన దారుణాన్ని చూసిన వేణు, అన్న కూతురు జయ కాపురం కోసం ఆ నేరాన్ని తనపై వేసుకుంటాడు. కానీ, వేణు అమాయకుడని రాధ విలపిస్తుంది. డిఫెన్స్ లాయర్ గా శాంతి కేసు వాదిస్తుంది. హంతకుడు తన చేయి తొక్కాడని, అతణ్ణి తాను స్పర్శతో గుర్తు పట్టగలనని రాధ చెబుతుంది. అనుమానస్తులందరినీ హాజరు పరుస్తారు. కుమార్ తన చేయి తొక్కగానే అతనే దోషి అని రాధ పట్టేస్తుంది. దాంతో కుమార్ ను అరెస్ట్ చేసి కోర్టు బోను ఎక్కిస్తారు. అదే సమయంలో జయ తన భర్త దాచి పెట్టిన కత్తిని కోర్టు ముందు హాజరు పరుస్తుంది. మంచిని గెలిపించడానికి మంచిమనసులు ఉన్నవారు పాటుపడ్డారని, వారున్న లోకంలో తాను ఉండటానికి అనర్హుణ్ణని కుమారే నేరం అంగీకరిస్తాడు. రాధకు కొడుకు పుడతాడు. అదే సమయంలోనే వేణు నిర్దోషి అని రుజువవుతుంది. కుమార్ ను జయ క్షమించమని కోరుతుంది. తనలాంటి వాడిలో మార్పు రావడానికి సరైన పనే చేశావని కుమార్ జైలుకు వెళతాడు. రాధకు వేణును అప్పగించి, ఇది జయ చేసిన త్యాగం వల్లే సాధ్యమయిందని చెబుతుంది శాంతి. తన కన్నవారితో కలసి శాంతి వెలుతూ ఉండగా కథ ముగుస్తుంది.

వేణుగా ఏయన్నార్, శాంతిగా సావిత్రి, రాధగా షావుకారు జానకి, ఆనందరావుగా యస్వీ రంగారావు, కుమార్ గా నాగభూషణం, జయగా వాసంతి నటించిన ఈ చిత్రంలో గుమ్మడి, రమణారెడ్డి, వంగర, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, పొ్ట్టి ప్రసాద్, చిడతల అప్పారావు, సూర్యకళ నటించారు. ఈ చిత్రానికి ముందు వాసంతి కొన్ని సినిమాల్లో నటించినా, ఆమెకు నటిగా మంచి పేరు సంపాదించి పెట్టిందీ చిత్రం. అందువల్ల ఆమెను అందరూ ‘మంచిమనసులు’ వాసంతి అని పిలిచేవారు. తరువాతి కాలంలో వాసంతి నిర్మాతగా మారి భానుచందర్, భానుప్రియతో ఓ ప్రేమకథాచిత్రం నిర్మించి, దానికి ‘మంచిమనసులు’ అనే పేరు పెట్టడం విశేషం!

‘మంచిమనసులు’ చిత్రానికి తమిళంలో రూపొందిన ‘కుముదం’ సినిమా ఆధారం. అందులోనూ షావుకారు జానకి, యస్వీరంగారావు నటించారు. తెలుగులోనూ వారి పాత్రలు వారే ధరించారు. ఈ చిత్రానికి కథ కె.యస్. గోపాలకృష్ణన్, మాటలు ఆచార్య ఆత్రేయ రాశారు. ఈ సినిమాకు ఆచార్య ఆత్రేయ, శ్రీశ్రీ, దాశరథి, ఆరుద్ర, కొసరాజు పాటలు పలికించారు. మహదేవన్ స్వరకల్పనలో ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలచింది. ఇందులోని “ఏమండోయ్ శ్రీవారు…”, “నన్ను వదలి నీవు పోలేవులే…”, “మామ మామ మామా…”, “ఒహో ఒహో పావురమా…”, “త్యాగము ఇదియేనా…”, “ఎంత టక్కరివాడు…” పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో “శిలలపై శిల్పాలు చెక్కినారు…” పాటలో ముందుగా “అహో ఆంధ్రభోజా…” అంటూ సాకీ మొదలవుతుంది. అప్పుడు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు నేర్పుగా ‘తెనాలి రామకృష్ణ’లోని శ్రీకృష్ణదేవరాయలుగా నటించిన యన్టీఆర్ ను చూపించడం, అందులోనే తెనాలి రామకృష్ణగా నటించిన ఏయన్నార్ నూ పాటలో తగిన విధంగా చొప్పించడం చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ పాట ప్రారంభంలోనే యన్టీఆర్ తెరపై కనిపించగానే, ఆ రోజుల్లో థియేటర్లు ఈలలతో దద్దరిల్లి పోయేవి. ఆ తరువాత “మామ మామా మామా…” పాట జనంతో చిందులు వేయించింది.

సి.సుందరం నిర్మించిన ‘మంచిమనసులు’ చిత్రం ఘనవిజయం సాధించింది. 15 పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. రజతోత్సవం జరుపుకుంది. 1962 సంవత్సరం బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలచింది. రిపీట్ రన్స్ లోనూ ‘మంచిమనసులు’ విశేషాదరణ చూరగొంది.

Show comments